పరకాల, జూలై 15 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉనికి కోసమే కొన్ని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు మండలాలకు చెందిన 110 మందికి రూ.1.1 కోట్ల విలువ చేసే కల్యాణలక్ష్మి చెక్కులను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్ కావడం ప్రజల అదృష్టమన్నారు. పక్క రాష్ర్టాల ప్రజలు తమ ప్రాంతాల్లో తెలంగాణ పథకాలు అమలు కావడంలేదని, తమను తెలంగాణ రాష్ట్రంలో కలుపాలని ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నారని, సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నారు. కానీ, సోయిలేని విపక్ష పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విపక్షాలకు స్థానం లేదని, ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. గ్రామాల్లోకి వచ్చే ప్రతిపక్ష పార్టీల నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్ర పథకాలను ఎందుకు అమలు చేస్తలేరో ప్రశ్నించాలన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డకుంటుందని విమర్శించారు. రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా ప్రధాని మోదీ వివక్ష చూపుతున్నాడని అన్నారు. విపక్ష పార్టీలు ఆరోపణలు మానుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవుపలికారు. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, తహసీల్దార్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కటాక్షపురం చెరువు పరిశీలన..
ఆత్మకూరు : కటాక్షపురం పెద్ద చెరువును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. మత్తడి వద్ద పూజలు చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయని తెలిపారు. మత్తడి తక్కువగానే పోస్తున్నందున వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. చెరువుల్లోకి ఈత, చేపల వేట కోసం వెళ్లొద్దని కోరారు. ఆయన వెంట రెడ్ క్రాస్ డైరెక్టర్ దుంపల్లపల్లి బుచ్చిరెడ్డి, ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, హౌసుబుజుర్గు, కటాక్షపురం సర్పంచ్‌లు రబీయాబీ హుస్సేన్, మచ్చిక యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, టీఆర్ఎస్ నాయకులు గుండెబోయిన బాలకృష్ణ, శీరంశెట్టి సుమన్, అర్షం మధుకర్, దుప్పటి శంకర్ ఉన్నారు.
ఆత్మకూరులో పర్యటన..
వర్షాలకు ఆత్మకూరు మండల కేంద్రంలో కూలిపోయిన కోడూరి స్వామి ఇంటిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. స్వామి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వర్షాలకు కూలిన ఇండ్ల వివరాలను సర్పంచ్ వంగాల స్వాతీభగవాన్రెడ్డి ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన కోడూరి స్వామికి డబుల్ బెడ్ రూం ఇల్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇల్లు కూలిపోయిన ఇండ్ల వివరాలను అందజేయాలని తహసీల్దార్ సురేశ్‌కుమార్‌ను ఆదేశించారు.
తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, ఎంపీటీసీ బయ్య రమారాజు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పాపని రవీందర్, మండల కోఆప్షన్ మెంబర్ ఎండీ అంకూస్, పీఏసీఎస్ డైరెక్టర్ వీర్ల వెంకటరమణ, వార్డు సభ్యులు రేవూరి ప్రవీణ్‌రెడ్డి, వెల్దె జమునాకోటయ్య, రాసమల్ల అనితానరేందర్, నత్తి రవీందర్, బైగాని రాజేందర్, పొదిల సదయ్య పాల్గొన్నారు.
కార్యకర్తలను కాపాడుకుంటా..
టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని హౌసుబుజుర్గు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మార్క రజినీకర్గౌడ్ ఇటీవల పొలంలో జారిపడి గాయపడ్డాడు. ఆయనను ఎమ్మెల్యే చల్లా పరామర్శించారు.