ధర్మసాగర్, జూలై 10 : పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిరుద్యోగులకు సూచించారు. మండలంలోని కరుణాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అనురాగ్ యూనివర్సిటీ, పల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు 60 రోజులు నిర్వహించిన ఉచిత కోచింగ్ ముగింపు కార్యక్రమం ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి సీపీ డాక్టర్ తరుణ్‌జోషి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2014లో 1.30లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. సంవత్సరంలో కూడా లక్ష ఉద్యోగాల వరకు వివిధ శాఖల్లో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందు కోసం నిరుద్యోగులకు రెండు నెలల పాటు అన్ని రకాల సౌకర్యాలతో ఉచిత కోచింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగాలను 95 శాతం స్థానికులకే ఇస్తున్నట్లు చెప్పారు.
వివిధ దశల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో కోచింగ్‌లో నేర్చుకున్న అంశాలతోపాటు మెటీరియల్‌తో ఇంటి వద్ద చదువుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఇక్కడ కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధించిన వారికి ఇదే సెంటర్లో విజయోత్సవ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ జీవితంలో కష్టపడి చదువుకుని, ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ సెల్ ఫోన్లు, ఫేస్బుక్, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. పరీక్ష సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా రాయాలన్నారు. సమావేశంలో హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎంపీపీ కవిత, జడ్పీటీసీ చాడ సరిత, తహసీల్దార్ ఎం రజిని, ఎంపీడీవో జవహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వర్లు, సెంటర్ కోఆర్డినేటర్ సంపత్, బోధన సిబ్బంది హరి, నాగరాజు, శ్రవణ్, శర్మ, నర్సింహారావు, డీపీఎస్ కరస్పాండెంట్ రాజిరెడ్డి, ప్రిన్సిపాల్ రవికిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.