కరీమాబాద్, జూలై 10: ఓరుగల్లు ఆదివారం బోనమెత్తింది. బీరన్న బోనాలతో జిల్లావ్యాప్తంగా సందడి నెలకొంది. డోలు వాయిద్యాల మధ్య అబ్బురపడేలా బీరన్నల విన్యాసాలు.. దారి పొడవునా బోనాల వరుస.. బురుజు సెంటర్లో బీరన్నలు పట్టే గావు చూసేందుకు తరలివచ్చిన జనసందోహం.. వెరసి కురుమల బీరన్న బోనాల పండుగ కరీమాబాద్ ప్రాంతంలో కనులపండుగలా సాగింది. కురుమలు ఇంటిల్లిపాదీ బోనాలతో ఆలయాలకు తరలివెళ్తుంటే.. పిల్లాపాపలతో ఊరంతా తరలివచ్చి బోనాలు, బీరన్నల విన్యాసాలను ఆత్రంగా తిలకించారు. తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం వరంగల్ నగరంలో కురుమల బీరన్న బోనాలు నిర్వహించారు.
కురుమ కులస్తుల ఆరాధ్యదైవం బండారి దేవుడు బీరన్నకు అమిత భక్తిశ్రద్ధలతో బోనాలు చేశారు. వందల ఏళ్ల నుంచి బీరన్నకు బోనాలు చేయడం ఆనవాయితీ. ఉర్సు, కరీమాబాద్, రంగశాయిపేట ప్రాంతాల్లో బోనాల పండుగ వైభవంగా సాగింది. ఉదయం ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బోనాలతో ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బురుజు సెంటర్లో గావు పట్టే గొర్రె పిల్లను ఎత్తుకొని ఉత్సాహపరిచారు. మేయర్ గుండు సుధారాణి, టీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు బోనం ఎత్తుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కురుమలు పాల్గొన్నారు.
‘ఓసిటీ’లో బోనాల వేడుకలు
పోచమ్మమైదాన్: వరంగల్ 19వ డివిజన్ ‘ఓసిటీ’లోని బీరన్న ఆలయంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బీరన్న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఎత్తుకొని వచ్చి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజుయాదవ్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి కుమారస్వామి, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, బీరన్న ఆలయ కమిటీ అధ్యక్షుడు కంచ సంపత్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు.
నర్సంపేటరూరల్: మండలంలోని అన్ని గ్రామాల్లో బీరన్న బోనాలు ఘనంగా జరిగాయి. దాసరిపల్లి, గురిజాలలో యాదవ సంఘాల ఆధ్వర్యంలో బీరన్న బోనాల పండుగ నిర్వహించారు. ఆడబిడ్డలు బోనాలను నెత్తిన ఎత్తుకొని డప్పుచప్పుళ్ల మధ్య బీరన్న ఆలయానికి చేరుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించి నియమనిష్టలతో కొలిచారు. దాసరిపల్లిలో పెద్ద గొల్ల తోటకూరి ఐలయ్య, సారగొల్ల మేర్గు నర్సయ్య, మేకల రాజు, మల్లేశ్, కుమారస్వామి, వేణు, జండు, అశోక్, రాము, కోటి, నర్సయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చెన్నారావుపేట: కట్టయ్యపల్లె, చెన్నారావుపేటలో యాదవుల ఆరాధ్య దైవమైన బీరన్న బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా యాదవులు బీరన్నకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఇందులో కులపెద్దల ఆధ్వర్యంలో మహిళలు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా బోనాలతో ర్యాలీగా ఆలయానికి తరలివచ్చి ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని కొలిచారు. అనంతరం కోరిన కోరికలు నెరవేర్చాలని బీరన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.