నర్సంపేట, జూలై 10: భారీ వర్షాల నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. ఆదివారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా రానున్న 48 గంటలపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని తెలిపారు. నియోజకవర్గంలో పలు చోట్ల వాగులు, వంకలు వరద నీటితో పోటెత్తుతున్నాయని చెప్పారు. అధికార యంత్రాంగం అప్రమత్తండా ఉండాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు 24 గంటలపాటు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ రెండు రోజుల్లో సిబ్బంది ఎవరూ సెలవులపై వెళ్లొద్దని ఆదేశించారు.
భారీ వర్ష సూచన ఉన్నందువల్ల నియోజకవర్గంలోని ప్రజలెవరూ అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు లోతట్టు ప్రాంతాల వారీగా అప్రమత్తం చేసి తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. వర్షాలు అధికంగా పడడంతో రోడ్లు కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉందన్నారు. ధ్వంసమైన రోడ్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.