శాయంపేట, జూన్ 25 : పల్లెల్లో క్రీడా ప్రాంగణాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. గ్రామీణ యువతతో పాటు పెద్దలకు ఆటవిడుపుగా ఉండేలా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటవుతున్నాయి. ప్రతి ఊరికి ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నారు. పల్లెల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సౌకర్యాలను సిద్ధం చేస్తున్నది. వాలీబాల్, కబడ్డీ, ఖోఖోతో పాటు లాంగ్‌జంప్ వంటి క్రీడల నిర్వహణకు అధికారులు ఈ ప్రాంగణాల్లో వసతులు కల్పిస్తున్నారు. అందరికీ ఉపయోగపడేలా వ్యాయామ పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మండల పరిధిలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 21 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలను సిద్ధం చేశారు. ఒక్కో ప్రాంగణానికి ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నారు. అంత స్థలం లేకపోయినా అరకెరం ఉన్నప్పటికీ క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే శాయంపేట, సూర్యనాయక్‌తండాలో క్రీడా ప్రాంగణాలను వరంగల్ జడ్పీచైర్‌పర్సన్ గండ్ర జ్యోతి ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో త్వరగా క్రీడా మైదానాలు ఏర్పాటు కావాలని ఆమె సూచించారు. ఈ క్రమంలో ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, ఈజీఎస్ ఏపీవో కీర్తి అనిత గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నారు. అప్పయ్యపల్లి, నర్సింహులపల్లి, రాజుపల్లి గ్రామాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలకు రెవెన్యూ అధికారులు స్థలాలను కేటాయించారు. జీపీల్లో తీర్మానాలు చేస్తూ ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ క్రీడా మైదానాల ఆర్చీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మొదటిసారి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఊరిలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రతి క్రీడా ప్రాంగణంలో కబడ్డి ఆటకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, ఖోఖో కోర్టు, వాలీబాల్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. లాంగ్‌జంప్‌కు ప్రత్యేకంగా ఏర్పా టు చేస్తున్నారు. ఇందుకోసం ఐరన్ పోల్స్, నెట్, బాల్స్ అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మెటీరియల్ కోసం సుమారు రూ.50వేలు ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే, స్థలాల చదును కోసం మొరం పోయించడం వంటి వాటికి నిధులను అందిస్తున్నారు. మొత్తంగా ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ.4లక్షల వరకు జాతీయ ఉపాధి హామీ నుంచి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే, జీపీ నిధులను కూడా వెచ్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్చీ ఏర్పా టు చేయడంతో పాటు లాంగ్‌జంప్ కోసం గుంత, ఇసుక ఏర్పాటు చేస్తున్నారు. శారీరక వ్యాయామం కోసం బార్లను ఏర్పాటు చేస్తున్నారు.