ఖానాపురం, జూన్ 25: మండలంలోని కొత్తూరులో సీఏ విజిత అవినీతి, అక్రమాలపై డ్వాక్రా సంఘాల సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏ విజిత గ్రామంలోని 43 సంఘాల సభ్యులను మోసం చేసి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడిందని, విచారణ చేపట్టి నిజానిజాలను వెలికితీయాలని కోరుతూ గత నెలలో సంఘాల సభ్యులు ఏపీఎం సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఓరుగల్లు మహా సమాఖ్య ఆడిటర్లు కొత్తూరు జీపీ కార్యాలయ ఆవరణకు వచ్చారు. ఈ క్రమంలో ఆడిట్ నిర్వహణకు వచ్చిన వారికి విజిత సరైన రికార్డులు సమర్పించకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఏపీఎం సుధాకర్, సీఏ విజితను జీపీ గదిలో నిర్బంధించారు. గ్రామస్తులు, డ్వాక్రా సంఘాల సభ్యుల కథనం ప్రకారం.. కొత్తూరుకు చెందిన ఇందిరా గ్రామైక్య సంఘానికి కొన్నేళ్ల నుంచి విజిత సీఏగా పని చేస్తున్నది.
గ్రామంలోని 43 సంఘాల నిర్వహణ బాధ్యతను ఆమె చూసుకుంటున్నది. ఈ క్రమంలో మహిళా సంఘాల అధ్యక్షుల వద్ద ఉండాల్సిన రికార్డులన్నింటినీ తన వద్దే ఉంచుకొన్న సీఏ.. ఆరేళ్లుగా రూ. 1.50 కోట్ల అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు ఆడిటర్లు శివ, ప్రసాద్ కొత్తూరుకు వచ్చారు. కానీ, సీఏ విజిత ఆడిటర్లకు రికార్డులను అందజేయలేదు. ఆడిటర్లు కోరినా దాటవేత ధోరణి అవలంబించడంతో గ్రామస్తులు, మహిళలు ఆగ్రహించారు. అదేవిధంగా ఏపీఎం సుధాకర్ సీఏకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహించిన మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు సీఏ, ఏపీఎంను నిర్బంధించారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, సర్పంచ్ బూస రమ అశోక్ కొత్తూరు జీపీకి చేరుకుని మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడి సీఏ, ఏపీఎంను బయటకు తీసుకొచ్చారు. సీఏను, ఆమెకు సహకరిస్తున్న ఏపీఎంను వెంటనే విధుల్లోంచి తొలగించాలని సభ్యులు నినాదాలు చేశారు.
ఆడిట్‌ను మధ్యలోనే నిలిపేశాం: ఆడిటర్స్
సరైన రికార్డులు లేకపోవడంతో ఆడిట్‌ను మధ్యలోనే నిలిపివేశామని ఆడిటర్లు తెలిపారు. సంఘం సభ్యుల వద్ద ఉండాల్సిన బ్యాంకు పాస్‌పుస్తకాలు, గ్రామైక్య సంఘాల పుస్తకాలు సీఏ వద్దే ఉన్నట్లు గుర్తించామన్నారు. సంఘం సభ్యుల పోర్జరీ సంతకాలతో సీఏ రుణాలు తీసుకుంటున్న గుర్తించామన్నారు. సంఘాలకు సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేయలేదన్నారు. తీర్మాణాలు ఇష్టారాజ్యంగా ఉన్నాయన్నారు. రుణం తీసుకున్న సభ్యుల నుంచి అదనపు కిస్తీలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఏ విజిత మాట్లాడుతూ తాను సంఘం సభ్యులకు సంబంధించిన రూ. 9,79,435 వాడుకున్నానని, వీటిని తిరిగి సంఘాలకు చెల్లిస్తానని అంగీకార పత్రాన్ని ఆడిట్ బాధ్యులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. ఏపీఎం సుధాకర్ మాట్లాడుతూ ఉన్నతాధికారులతో పూర్తి విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. డీఆర్డీవో మాట్లాడి ఆడిటర్లకు బ్యాంకు వివరాలు అందిస్తానని తెలిపారు.