దుగ్గొండి, జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మనఊరు-మనబడి కార్యక్రమంతో సర్కారు బడులకు పూర్వ వైభవం తీసుకురావాలని డీఈవో వాసంతి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మనఊరు-మనబడి కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా డీఈవో వాసంతి పాల్గొని మాట్లాడారు. ‘మనఊరు-మనబడి’ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానుందన్నారు. సర్కారు బడిలో చదివే ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. గ్రామంలోని సర్కారు బడిలో విద్యార్థులను చేర్పించేందుకు గ్రామస్తులు ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో నిత్యం పరిసరాల శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ పిల్లల తల్లిదండ్రులకు సర్కారు బడులపై నమ్మకం కలిగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమీక్షలో ఎంపీపీ కోమల, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, పీఆర్ ఏఈ హరిదాస్యం వెంకటేశ్వర్లు, ఎంఈవో చదువుల సత్యనారాయణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పనులను త్వరగా పూర్తి చేయాలి
చెన్నారావుపేట: మనఊరు-మనబడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి డాక్టర్ బాలకృష్ణ సూచించారు. నోడల్ అధికారి సృజన్తేజతో కలిసి శనివారం ఎంపీడీవో కార్యాలయంలో పాఠశాలల అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మనఊరు-మనబడి పాఠశాలల అభివృద్ధి పనులను ఎస్ఎంసీ చైర్మన్లు సకాలంలో పూర్తి చేయాలని, వారికి స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఎన్ఆర్జీసీ, ఈజీఎస్ పనులను కూడా పూర్తి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో హెచ్ఎం మనఊరు- మనబడి రికార్డులను నిర్వహించాలని, ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. సమీక్షలో ఎంపీడీవో దయాకర్, సర్పంచ్‌లు, హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లు, ఎమ్మార్సీ సిబ్బంది, సీఆర్పీలు పాల్గొన్నారు.