హనుమకొండ సబర్బన్, జూన్ 25 : ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ సూక్తిని అక్షరాలా పాటిస్తూ భీమదేవరపల్లి మండలం ముల్కనూరు యువకులు గ్రామంలో 2014లో ప్రజాగ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడిన కొందరు, స్పందన చారిటబుల్ ట్రస్టు, ముల్కనూరు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సేవా బృందాల బాధ్యులు ప్రజాగ్రంథాలయ నిర్వహణలో భాగస్వాములవుతున్నారు. దాతల సాయంతో పోటీ పరీక్షల కోసం వందలాది పుస్తకాలను అందుబాటులో ఉంచగా వందలాది మంది ఇక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. జాతీయస్థాయిలో ఏటా కథల పోటీలు నిర్వహిస్తూ విజేతలకు బహమతులు ప్రదానం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులు గ్రంథాలయ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రజల గొంతుకగా ఉన్న ‘నమస్తే తెలంగాణ పత్రిక’ ముల్కనూరు ప్రజాగ్రంథాలయానికి తోడైంది. మూడేళ్లుగా సంయుక్తంగా జాతీయ స్థాయి తెలుగు కథల పోటీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో అనేక మంది పాల్గొని తమ కథా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు ప్రదానం చేస్తున్నారు.
విజేతల కథలతోపాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన కథలను ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం ప్రత్యేక సంచికలో ప్రచురిస్తూ లక్షలాది మందికి చేరవేస్తోంది. ఈ క్రమంలో మూడో ఏడాది కథల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాతూరి సుధాకర్‌రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ హాజరుకానున్నారు. రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులు కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. భీమదేవరపల్లి జడ్పీటీసీ వంగ రవీందర్, ఎంపీపీ జక్కుల అనిత, సర్పంచ్ మాడ్గుల కొమురయ్య, ఎంపీటీసీలు బొల్లంపల్లి రమేశ్, అప్పని పద్మ పాల్గొననున్నారు.