నర్సంపేట, జూన్ 15: రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని 24వ వార్డులో రూ. 16 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ పనులకు బుధవారం పెద్ది శంకుస్థాపన చేసి మాట్లాడారు. సర్కారు దవాఖానల బలోపేతానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్పొరేట్ వైద్యశాలల తరహాలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నారని చెప్పారు. నర్సంపేటను హెల్త్‌హబ్‌గా మార్చేందుకు 250 పడకల దవాఖానతోపాటు డయాగ్నోస్టిక్ సెంటర్ మంజూరైందన్నారు.
పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. అనంతరం పట్టణంలోని 18వ వార్డు సరోజినీదేవిరోడ్డు కాలనీకి చెందిన వావిల్ల కళావతి వైద్యం కోసం రూ.2.50 లక్షల విలువైన ఎల్వోసీని బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ కమిషనర్ నాయిని వెంకటస్వామి, కౌన్సిలర్లు దార్ల రమాదేవి, రాయిడికీర్తి దుశ్యంత్‌రెడ్డి, మినుముల రాజు, బండి రమేశ్, సారంగపాణి పాల్గొన్నారు. తర్వాత హైదరాబాద్‌లో ఉత్తమ రక్తదాత అవార్డు అందుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, డాక్టర్ రాజేశ్వర్‌రావు ఘనంగా సన్మానించారు.
సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం
ఖానాపురం: బుధరావుపేట సర్వతోముఖాభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధరావుపేటలో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు సీసీరోడ్లు, డైనేజీలను ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ది మాట్లాడుతూ కరోనా కారణంగా రెండేళ్లు అభివృద్ధి పనులు ఆగిపోయాయని, రాబోయే ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ధీమా వ్యక్త చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 16 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం 7,650 యూనిట్ల రక్తాన్ని అందించామని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రంలోనే నర్సంపేటకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
రాబోయే వంద రోజుల్లో నియోజకవర్గ ప్రజల కోసం 57 రకాల రక్తపరీక్షల కేంద్రం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. బుధరావుపేట జీపీలో మీటింగ్ హాల్ కోసం అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో మూడు కిలో మీటర్ల సీసీ రోడ్లకు నిధులు అందిస్తానని చెప్పారు. అనంతరం గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ అందించిన దాతలను పెద్ది సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్, ఎంపీటీసీ సుభాన్‌బీ మౌలానా, ఎంపీటీసీ లింగమ్మ-మురళి, ఉపసర్పంచ్ రమ-మురళి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ కన్వీనర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పెద్దికి శుభాకాంక్షలు..
చెన్నారావుపేట: ఉత్తమ బ్లడ్ డోనర్, మోటివేటర్ అవార్డును మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని మండలంలోని నాయకులు నర్సంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, టీఆర్ఎస్ మండల నాయకుడు కృష్ణచైతన్య, మండల ఉపాధ్యక్షుడు కుసుమ నరేందర్, మాజీ ఎంపీటీసీ కుమారస్వామి, సుమన్ పాల్గొన్నారు.