నర్సంపేట రూరల్, జూన్ 15: ప్రభుత్వ, చెరువు శిఖం భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్ హెచ్చరించారు. రాజుపేట శివారు నర్సంపేట-నల్లబెల్లి ఎన్‌హెచ్-365 జాతీయ ప్రధాన రహదారి పక్కన పెరుమాండ్లకుంట (పీతిరికుంట) మొత్తం 34 ఎకరాల్లో చెరువు శిఖంతోపాటు ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నంబర్ 8లో 25.10 ఎకరాలు, సర్వే నంబర్ 184లో 9.04 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ స్థలం జాతీయ రహదారిని ఆనుకొని ఉండడంతో మా ర్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎకరానికి సు మారు రూ. కోటికి పైగానే ధర పలుకుతున్నది. దీంతో కొంతమంది రియల్టర్ల కళ్లు ఈ విలువైన భూమిపై పడింది.
రాజుపేటకు చెందిన ఓ ప్రజాప్రతినిధి నర్సంపేటకు చెందిన మరో మాజీ ప్రజాప్రతినిధితో చేతులు కలిపి మూడు ఎకరాలు చెరువు శిఖంతోపాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నెల 2న తాసిల్దార్ వాసం రామ్మూర్తి, ఐబీ ఏఈ నితిన్ సమక్షంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి, హద్దులు ఏర్పాటు చేశారు. కాగా, బుధవారం ఆక్రమణదారులు చెరువు శిఖంతోపాటు ప్రభుత్వ భూమిలో సిమెంట్ పోల్స్ పాతుతుండగా స్థానికులు ఆర్డీవో పవన్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే తాసిల్దార్ రామ్మూర్తి, ఆర్ఐ రజాక్‌తో కలిసి ఆయన ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూమి అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లవని, చెరువు శిఖంలో సిమెంట్ పోల్స్ వేయొద్దని హెచ్చరించారు.