కాశీబుగ్గ, జూన్ 15: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సెస్ వసూలులో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా కార్యదర్శి బరుపాటి వెంకటేశ్రాహుల్కు ఉత్తమ కార్యదర్శిగా అవార్డు అందజేశారు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలో బుధవారం మార్కెటింగ్ శాఖ డీఎంవో, డీఈఈ, ఈఈ, జేడీఎం, డీడీఎంల సమావేశం మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు చేతుల మీదుగా వెంకటేశ్రాహుల్ అవార్డుతోపాటు ప్రశంసాప్రతం అందుకున్నారు. వరంగల్ మార్కెట్‌కు మార్కెటింగ్ శాఖ 2021-22 సంవత్సరానికి రూ. 28.50 కోట్ల సెస్ వసూలు టార్గెట్ విధించింది. రూ. 38.07 కోట్లు వసూలు చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో వరంగల్ మార్కెట్ కమిటీ నిలిచింది. అలాగే, వరంగల్ డీఎంవో పాలకుర్తి ప్రసాద్‌రావు, హనుమకొండ డీఎంవో సురేఖ ప్రశంసాపత్రంతోపాటు అవార్డు అందుకున్నారు.
జేడీఎం, డీడీఎంకు అవార్డులు
వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ రీజినల్‌లో వరంగల్ అత్యధికంగా మార్కెట్ సెస్ వసూలు చేసింది. వరంగల్ రిజినల్కు మార్కెటింగ్ శాఖ 2021-22 సంవత్సరానికి రూ. 307 కోట్ల టార్గెట్ విధించింది. కాగా, రూ. 295 కోట్లు వసూలు చేసి ముందజలో ఉంది. ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు చేతుల మీదుగా జేడీఎం ఎన్నారపు మల్లేశం, డీడీఎం అజ్మీరా రాజునాయక్ అవార్డులు అందుకున్నారు. అలాగే, వరంగల్ మార్కెట్ కార్యదర్శితోపాటు బోయినపల్లి, హైదరాబాద్, గడ్డిఅన్నారం, గుడిమల్కాపూర్, నిజామాబాద్, మిర్యాలగూడ, ఖమ్మం, సూర్యాపేట, కేసముద్రం మార్కెట్ కార్యదర్శులు అవార్డులు అందుకున్నారు.