వరంగల్, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. తెలంగాణపై కక్షతో అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకున్న కేంద్రం ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో తలొగ్గింది. హనుమకొండ- హైదరాబాద్ హైవేపై కాజీపేట వద్ద.. వరంగల్-ఖమ్మం హైవేపై హంటర్‌రోడ్డు విమ్స్ వద్ద రైల్వే లైన్లపై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం ఎట్టకేలకు అనుమతినిచ్చింది. నిన్నమొన్నటిదాకా ఇది రైల్వే స్థలమని చెబుతూ ఒక్కో బ్రిడ్జికి రూ.10కోట్ల చొప్పున మొత్తం రూ.20కోట్లు లీజు కింద చెల్లించాలని
మెలికలు పెట్టింది. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన నిర్మాణాలను మధ్యలోనే అడ్డుకున్నది. ప్రజల అవసరాల కోసం చేసే పనులకు ఆటంకాలు కలిగించవద్దని రాష్ట్ర సర్కారు గట్టిగా చెప్పడంతో వెనక్కి తగ్గింది. ఎలాంటి లీజు చెల్లించకుండా బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేసేందుకు అనుమతులిస్తూ కేంద్ర రైల్వే శాఖ ఈనెల 10న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు సోమవారం ఈ ఉత్తర్వులు అందగా ఇక రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు వేగంగా పూర్తికానున్నాయి.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చోట కొత్త రోడ్లు నిర్మిస్తున్నది. ఈ ప్రక్రియలో భాగంగా కాజీపేట, హంటర్‌రోడ్డులో రైల్వే లైన్‌పై ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ రెండు బ్రిడ్జిలు జాతీయ రహదారులపైనే ఉన్నాయి. జాతీయ రహదారులపై కేంద్ర ప్రభుత్వ నిధులతోనే బ్రిడ్జిలు కట్టాలి. కానీ, ఈ రెండు బ్రిడ్జిలకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం మొదలైంది. రైలు పట్టాలపై మినహా మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయి. తీరా పట్టాలపై బ్రిడ్జి నిర్మాణం సమయంలో రైల్వే శాఖ అడ్డంకులు సృష్టించింది.
రైల్వే శాఖ పరిధిలోని స్థలంలో బ్రిడ్జి నిర్మిస్తున్నారు కాబట్టి లీజు కింద ఒక్కో బ్రిడ్జికి రూ.10కోట్లు చెల్లించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు లేఖ పంపింది. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం నిర్మించే బ్రిడ్జిలకు లీజు మొత్తం చెల్లించడం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఇలాంటి నిబంధనల వల్ల ప్రజలకు సౌకర్యాల కల్పనకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొంది. రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించే బాధ్యత కేంద్రనిదే అయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నామని, ఈ పనులకు అడ్డంకులు సృష్టించవద్దని స్పష్టం చేసింది. పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని గట్టిగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకున్నది. రైల్వే శాఖకు ఆదేశాలు ఇచ్చింది.
పనులిక వేగవంతం
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలోని కాజీపేట వద్ద రైల్వే లైన్ ఉంది. 1974లో దీనిపై బ్రిడ్జి నిర్మించారు. 20 ఏండ్ల క్రితం హంటర్‌రోడ్డు ఆర్వోబీని నిర్మించారు. మారిన పరిస్థితులతో వరంగల్-హైదరాబాద్ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. పాత బ్రిడ్జికి సమాంతరంగా కొత్తగా ఇంకో బ్రిడ్జి నిర్మించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పలుసార్లు కేంద్రాన్ని కోరింది.
రైల్వే లైన్లపై బ్రిడ్జిల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగం చొప్పున నిధులివ్వాలని నిబంధనలున్నాయి. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రూ.78 కోట్లతో కాజీపేట వద్ద, రూ.50 కోట్లతో హంటర్‌రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జిలను సొంతంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 2017లో నిర్ణయించింది. పనులు మొదలైన తర్వాత తమ స్థలం కాబట్టి లీజు మొత్తం ఇవ్వాలని రైల్వే శాఖ పట్టుబట్టి పనులు ఆపింది. దీంతో పనులు ఆలస్యంకాగా ఇప్పుడు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో పనులు వేగంగా పూర్తి కానున్నాయి.
కేంద్రం తీరును ఎండగట్టిన ‘నమస్తే’
కేంద్ర ప్రభుత్వ తీరుతో రైల్వే శాఖ కొర్రీలు పెట్టడం.. రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఆగిపోవడంపై ‘ఆర్వోబీల్లో కేంద్రం కొర్రీలు’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ ఏప్రిల్ 24న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై రైల్వే శాఖలో తీవ్ర చర్చ జరిగింది. ప్రజలకు అవసరమైన వసతుల కల్పనకు రైల్వే శాఖ ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నదని ఆ శాఖలోని ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల ఆధారంగా బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతినిచ్చింది.