జనగామ, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. తొలకరి పలకరింపుతో పొలం బాట పట్టారు. నైరుతి రుతుపవనాలతో జిల్లాలో రెండు రోజులుగా అక్కడక్కడా మోస్తరు వర్షం పడడంతో వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. మంగళవారం ఆయా గ్రామాల్లో కొందరు దుక్కి దున్నగా, మరికొందరు పత్తి గింజలు నాటారు. ఇంకొందరు నారుమడుల కోసం పొలం మడిని సిద్ధం చేశారు. అదేవిధంగా జనగామ పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు, విత్తనాల కొనుగోళ్ల సందడి కనిపించింది. వారం, పది రోజుల్లో వానకాలం పంటల పెట్టుబడి సాయం అందనుంది. ఈ సీజన్లో జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 3,70,008 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం సర్కారు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచింది.
వరుణుడు కరుణించడంతో జిల్లాలో సాగు సందడి మొద లైంది. ఇప్పటికే కొందరు రైతులు బోర్లు, బావుల కింద నార్లు పోసుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో నారు మడుల కోసం పొలం మడి సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఓ మోస్త్తరు వర్షం కురవడంతో ఇప్పటికే దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న విత్తనాలు వేసుకునేందుకు సంసిద్ధులయ్యారు.
3.70 లక్షల ఎకరాల్లో పంటలు..
ఈ సారి వానకాలంలో సీజన్లో జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 3,70,008 ఎకరాల్లో సాగవుతా యని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. 1,67,639 ఎకరాల్లో వరి, 1,67,666 ఎకరాల్లో పత్తి, 23, 699 ఎకరాల్లో కంది, 4973 ఎకరాల్లో మక్కజొన్న, 799 ఎకరాల్లో వేరుశనగ, 317 ఎకరాల్లో పొగాకు పంట సాగవుతుందని అంచనా వేసింది. ఈ సీజన్లో సాగయ్యే వివిధ రకాల పంటలకు 1,11,077 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
వారంలో రైతుబంధు సాయం..
రైతు బంధు పథకం కింద వానకాలం పంటల పెట్టుబడికి రైతన్నల బ్యాంకు ఖాతాల్లో వారం పదిరోజుల్లో డబ్బులు జమకానున్నాయి. గత యాసంగిలో 1,62, 966 మంది రైతులకు రూ.201.06 కోట్ల సాయం అందించింది. కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకం పొంది రైతుబంధు కోసం ఎంఈవోల వద్ద దరఖాస్తు చేసుకున్న రైతులకు సైతం ఈసారి పెట్టుబడి సాయం అందనుంది.
విత్తనాలు, ఎరువులు సిద్ధం
ఈ వానకాలం సీజన్లో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. పూర్తిస్థా యిలో వర్షాలు కురియక ముందే తొందరపాటుగా విత్తనాలు నాటి నష్టపోవద్దు. క్షేత్రస్థాయిలో వ్యవసా య అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొద్దిరోజుల్లో రైతుబంధు సాయం డబ్బులు కూడా జమవుతాయి. కొత్తగా పట్టాదార్ పాసుపుస్తకం వచ్చిన రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పేర్లను ఆన్లైన్లో నమోదు చేశాం. పంట పెట్టుబడి సాయం అందిస్తాం.
– వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి