మహబూబాబాద్, జూన్14 తెలంగాణ) : ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ స్థాపించే పార్టీ దేశ ప్రజలకు ఎంతో అవసరమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైందని, తెలంగాణ రాష్ట్ర తరహాలో ఇతర రాష్ర్టాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కుల, మతపరంగా అలజడి సృష్టించే పార్టీలకు ప్రజలు త్వరలోనే చమరగీతం పాడుతారని అన్నారు.
దేశ ప్రజల అవసరాల కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ అవతరించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేం ద్రంలో ఉన్న బీజేపీ ఎనిమిదేళ్ల కాలంలో రాష్ర్టానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మతపిచ్చితో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇటీవల మహబూబాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తగూడ: దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోలని మంత్రి సత్యవతిరాథోడ్ దళిత కుటుంబాలకు సూచించారు. మంగళవారం ఆమె కొత్తగూడలో రైతువేదిక భవనంలో కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి 19మంది దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.