ములుగుటౌన్, జూన్14: డీటీసీపీ అనుమతి లేని వెంచర్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టొద్దని కలెక్టర్ కృష్ణఆదిత్య అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం నిర్మాణాలు చేపట్టాలన్నారు. డీపీవో వెంకయ్య మాట్లాడుతూ వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చడానికి ముందు నాలా పర్మిషన్ తీసుకోవాలన్నారు. డీటీసీపీ అనుమతికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలని సూచించారు. డీటీసీపీ అనుమతి పొందిన తర్వాత ప్లాట్లు విక్రయించాలన్నారు. ఈ సందర్భంగా వెంచర్ యజమానులు మాట్లాడుతూ పదేళ్ల నుంచి సుమారు 90 శాతం ప్లాట్లను విక్రయించామని, వాటికి అనుమతి ఇవ్వాలని కోరారు. కొత్తగా చేసే వెంచర్లకు నిబంధనలు పాటిస్తామని అనడంతో కలెక్టర్ ఆ అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. సమావేశంలో డీఆర్వో రమాదేవి, డీపీవో వెంకయ్య, డీఎల్పీవో దేవరాజ్, ములుగు, వెంకటాపూర్ మండలాల పంచాయతీ అధికారులు, వెంచర్ యజమానులు పాల్గొన్నారు.
పుస్తకం ఆవిష్కరణ
ఉద్యోగార్థుల కోసం రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిన తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2022 తెలుగు అనువాద పుస్తకాన్ని కలెక్టర్ కృష్ణ ఆదిత్య మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందన్నారు. పుస్తకాన్ని సబ్సిడీపై రూ.150 విక్రయిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు ఉప గణాంక అధికారి లక్ష్మీనారాయణ నంబర్ 9441001893లో సంప్రదించాలన్నా రు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాశ్, అశోక్ ఎంపీఎస్వో, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఐటీడీఏ పీవో
ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అంకిత్ మంగళవారం కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ కృష్ణ ఆదిత్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్వో రమాదేవి శుభాకాంక్షలు తెలపారు.