శిథిలావస్థకు చేరిన ఇల్లు ఇద్దరిని పొట్టన బెట్టుకున్నది. చార్‌బౌళి ప్రాంతంలోని ఓ పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా గోడ కూలి ఇద్దరు కూలీలు సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన బోసు సునీత(30), దేశాయిపేటకు చెందిన సదిరం సాగర్(22) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సునీత భర్త గతేడాది అనారోగ్యంతో మృతిచెందాడు. ఆదివారం సంవత్సరీకం చేయాల్సి ఉండగా ఇప్పుడు సునీత మృతితో వారి పిల్లలు ముగ్గురు అనాథలుగా మారారు. సాగర్ తండ్రి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. సాగర్ మృతితో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కాగా, బాధిత కుటుంబాలను ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్సీ హామీనిచ్చారు.
పాత ఇల్లు రిపేర్ చేస్తుండగా గోడ కూలి ఇద్దరు కూలీలు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. ఈ ఘటన శనివారం 25వ డివిజన్లోని చార్‌బౌళి ప్రాంతంలో జరిగింది. ప్రత్యక్షసాక్షులు, కూలీలు తెలిపిన వివరాల ప్రకారం… చార్‌బౌళికి చెం దిన ముజామిల్ షరీఫ్ పాత ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నాడు. మేస్త్రీ శ్రీను ఈ కాంట్రాక్టు తీసుకున్నా డు. షరీఫ్ పక్క ఇంటి గోడ శిథిలావస్థలో ఉండడాన్ని గమనించి శ్రీను, ఇతర కూలీలు పని చేసేందుకు ససే మిరా అన్నారు. ఈక్రమంలో ఆ ఇంటి ఓనర్ ముజాఫిర్ అలీఖాన్ ఈ గోడను కూడా కూలగొట్టాలని చెప్పా డు. శనివారం ఉదయం మేస్త్రీ శ్రీను బోసు సునీత, సదిరం సాగర్, కుమార్, జ్యోతి, మరికొంత మంది కూలీలతో పని చేయిస్తున్నాడు. ఈక్రమంలో ముజాఫిర్ అలీఖాన్ ఇంటి గోడ కూలి కూలీలపై పడింది. దీంతో సుందరయ్యనగర్ వాసి బోసు సునీత(30), దేశాయిపేటకు చెందిన సదిరం సాగర్(22) అక్కడికక్క డే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మేస్త్రీ శ్రీను, సెంట్రింగ్ వర్కర్ కుమార్‌ను ఎంజీఎం దవాఖానకు తరలించారు. సీఐ మల్లేశ్‌యాదవ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు.

అనాథలైన చిన్నారులు..
బోసు సునీత మరణంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సునీత భర్త లక్ష్మణ్ అనారోగ్యంతో గతేడాది మృతిచెందా డు. సునీత-లక్ష్మణ్ దంపతులకు నలు గురు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు చిన్నప్పుడే అనారోగ్య కారణాలతో మరణించాడు. భర్త సంవత్సరీకం ఆదివారం నిర్వహించాల్సి ఉండగా ఈ ప్రమాదంలో సునీత మృతితో సుందరయ్యనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. సునీత అత్త ఆ దేవుడు నన్ను తీసుకుపోయినా బాగుండు.. నా కోడలిని తీసుకెళ్లి ముగ్గురు పిల్లలను అనాథలను చేశాడని రోదిస్తుండడం పలువురిని కంటతడి పెట్టించింది. అలాగే, ప్రమాదంలో మరణించిన మరో కూలీ సాగర్ తండ్రి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
క్షతగాత్రులకు చికిత్స..
వరంగల్ చౌరస్తా : గోడ కూలిన ఘటనలో గాయాలపాలైన రాపెల్లి జ్యోతి (25), శ్రీను(40)కు ఎంజీఎం దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపా రు. అవసరమైతే మెరుగైన వైద్యసేవల కోసం హైదరాబాద్ తరలించడానికి చర్యలు తీసుకుంటామని ఎంజీ ఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన సదిరం సాగర్, వల్లెపు సునీత మృతదేహాలకు పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉండగా, ప్రమాదానికి కారణమైన ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు మార్చురీ ఎదుట ఆందోళన చేపట్టడంతో నిలిచిపోయింది.
ప్రభుత్వ సాయం అందేలా కృషి..
– ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య
వరంగల్ : చార్‌బౌళి ప్రాంతంలో గోడ కూలి ఇద్దరు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య అన్నారు. శనివారం ఉదయం దుర్ఘటన జరిగిన వెంటనే మైసూర్లో ఉన్న బస్వరాజు సారయ్య స్పందించారు. కూలి పనికి వచ్చి గోడ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన సాగర్(22), సునీత(30) కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా కృషి చేస్తానన్నారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కూలీలు జ్యోతి, శ్రీనుకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు సాయమందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
బాధితులను ఆదుకుంటాం..
– ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
గోడ కూలి మరణించిన సాగర్, సునీత కుటుంబాలను ఆదుకుంటామని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్థికసాయం అందేలా చూస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మేయర్ గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.