వరంగల్, జూన్ 11: గ్రేటర్ వరంగల్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న గృహాలను తక్షణమే తొలగించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో శనివారం ఆమె సమీక్షించారు. నగరంలో గుర్తించిన శిథిలావస్థ గృహాలు ప్రమాదంగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, వాటి కూల్చివేతలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు సుమారు 300 గృహాలను గుర్తించామని, వాటి యజమానులకు నోటీసులు జారీ చేశామని అధికారులు మేయర్‌కు వివరించారు. 76 శిథిల గృహాలను తొలగించినట్లు వెల్లడించారు. మిగిలిన వాటిని తక్షణమే కూల్చివేయాలని మేయర్ ఆదేశించారు. మళ్లీ నగరంలో సర్వే చేసి శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించాలన్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ వెంకన్న, లీగల్ అధికారి శ్రీనివాస్, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీలు శ్రీనివాస్, బషీర్, సుష్మ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
నాలాల పూడికతీతలో వేగం పెంచాలి
వర్షాకాలం సమీస్తున్న తరుణంలో గ్రేటర్ వరంగల్‌లో నాలాల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. నగరంలోని శాకరాశికుంట, భద్రాకాళీబండ్, బొందివాగు నాలాల పూడికతీత పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని 35 నాలాలను రూ. 90 లక్షలతో పూడికతీత పనులు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 80 శాతం పూడికతీత పనులు పూర్తి చేశామని, మిగితా పనులను వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ముంపు ప్రాంతాల్లో సమస్యలు తలెత్తకుండా అవసరం ఉన్న చోట కచ్చా కాల్వలు తవ్వాలని సూచించారు. స్థానిక ప్రజలు చెత్తను నాలాల్లో వేయకుండా స్వచ్ఛ ఆటోలకు అందించాలని కోరారు. స్వచ్ఛ ఆటోలకు చెత్తను అందజేయకుండా డ్రైనేజీలు, నాలాల్లో వేసిన గృహవాసులకు నోటీసులు జారీ చేయాలని శానిటరీ సూపర్వైజర్లను మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సిద్దం రాజు, ఎస్ఈ సత్యనారాయణ, సిటీప్లానర్ వెంకన్న, డీఈ నరేందర్, రవికిరణ్, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య పాల్గొన్నారు.