వరంగల్, జూన్ 11 : పాత భవనాలతో ప్రమాదాలు పొంచి ఉన్నా గ్రేటర్ అధికారులు పట్టించుకోవడం లేదు. సర్వేలతోనే కాలయాపన చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో శిథిల భవనాలు కూలుతున్న దుర్ఘటనలో ఒకరిద్దరు మృతి చెందుతున్నా గ్రేటర్ అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టడంతో విఫలం అవుతున్నారు. వర్షాకాలం ముందు శిథిలావస్థ భవనాలపై సర్వే పేరుతో హడావుడి చేయడం వారికి పరిపాటిగా మారింది. శిథిలావస్థలో ఉన్న భవనాల యజమానులకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. వర్షాలు పడే అవకాశాలు ఉన్నా ఇప్పటి వరకు శిథిలావస్థలో ఉన్న భవనాలపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. గత ఏడాది గ్రేటర్ అధికారుల చేసిన సర్వేలో సుమారు 400 శిథిల భవనాలు ఉన్నట్లు తేల్చారు. ఏడాది కాలంగా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి..
గ్రేటర్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న గృహాలు సుమారు 400 ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది వాటి సంఖ్య పెరుగుతోంది. గుర్తించిన గృహాల యజమానులకు అధికారులు ఇప్పటికీ నోటీసులు జారీ చేయలేదు. యజమానుల చిరునామా దొరకడం లేదన్న సమాధానాలు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేయడం తప్ప గ్రేటర్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
చర్యలేవీ..?
పాత గృహాలపై సర్వేలు చేయడం కాదు తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రతి ఏడాది సర్వేలు చేసి మిన్నకుండడం కంటే ప్రమాదం పొంచి ఉన్న ఇండ్లను గుర్తించి కూల్చివేతలు చేపట్టాలి. వరంగల్ ప్రాంతంలోని రామన్నపేట, పాపయ్యపేట, కాశీబుగ్గ, ఉర్సు, కరీమాబాద్, రంగశాయిపేటలో ఎక్కువగా పాత గృహాలు ప్రమాదకరంగా ఉన్నాయి. వర్షాకాలం వస్తున్న ప్రస్తుత తరుణంలో వెంటనే నోటీసులు జారీ చేసి కూల్చివేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గ్రేటర్ ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు పట్టణ ప్రగతి పేరుతో డివిజన్లలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత భవనాలను గుర్తించి తక్షణ చర్యలకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.