వరంగల్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : విద్యాసంవత్సరం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు జిల్లాలో మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తుత జూన్ నెలాఖరులోగా పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా ఈ నెల 13లోగా మండలానికో రెండేసి చొప్పున జిల్లాలో 26 స్కూళ్ల పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన 26 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్‌తో జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సదరు పాఠశాలలను సందర్శించి పనులు పరిశీలిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దేందుకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది.
ఈ కార్యక్రమం ద్వారా మూడు విడుతల్లో సర్కారు స్కూళ్లన్నింటినీ అభివృద్ధి పరిచేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. తొలివిడుత అభివృద్ధి చేసేందుకు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 223 స్కూళ్లను గుర్తించింది. పాఠశాలల్లో అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం కలెక్టర్ మండలానికో ఇంజినీరింగ్ విభాగాన్ని కేటాయించారు. ఈ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల చైర్మన్లు, ప్రదానోపాధ్యాయులు, సర్పంచ్‌లు, పూర్వ విద్యార్థులు, స్థానికులతో కలిసి అవసరాలను గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలు తయారు చేశారు. ఉన్నతాధికారులు పరిశీలించిన తరువాత వీటికి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తున్నది. ఇప్పటివరకు 200 స్కూళ్ల అభివృద్ధ్ది పనుల అంచనాలకు విడుతల వారీగా పాలనాపరమైన అనుమతులు లభించినట్లు అధికారులు వెల్లడించారు. మిగత 23 పాఠశాలల అంచనాల తయారీ కూడా తుది దశకు చేరిందని, త్వరలోనే వాటికీ ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతులు లభిస్తాయని తెలిపారు.
చురుగ్గా అభివృద్ధ్ది పనులు
తొలివిడుత ఎంపిక చేసిన పాఠశాలలన్నింటిలో మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా చేపట్టిన అభివృద్ధ్ది పనులన్నీ ప్రస్తుత జూన్ నెలాఖరులోగా పూర్తి కావాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. పాలనపరమైన అనుమతులు మంజూరైన స్కూళ్లలో అభివృద్ధి పనులను ఎస్ఎంసీలకు కేటాయిస్తున్నారు. ఒప్పందం జరిగిన వెంటనే పనులను ప్రారంభిస్తున్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావడానికి ఎస్ఎంసీలకు పెట్టుబడి కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. ఆయా పాఠశాలల పనుల అంచనా విలువ మొత్తంలో పదిహేను శాతం అందజేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 68 స్కూళ్లకు అభివృద్ధ్ది పనుల కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. దీంతో పాలనాపరమైన అనుమతులు లభించిన పలు పాఠశాలల్లో పనులు మొదలయ్యాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొన్ని స్కూళ్లలో మన ఊరు- మన బడి పనులను ప్రారంభించారు.
వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి వివిధ స్కూళ్లలో పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ బీ గోపి, డీఈవో వాసంతి పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోకవర్గంలో మన బస్తీ- మన బడి కార్యక్రమ పనులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అధికారులతో కలిసి పాఠశాలల్లో అభివృద్ధి పనులను మొదలు పెడుతున్నారు. పనులు ప్రారంభమైన స్కూళ్లలో చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే 13లోగా మండలానికో రెండు పాఠశాలల్లో అభివృద్ధ్ది పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీ గోపి అధికారులకు టార్గెట్ నిర్దేశించారు. జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి.
వీటిలో 26 పాఠశాలల్లో అభివృద్ధ్ది పనులను ఈ నెల 13లోగా పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. నిర్దేశిత పనులు పూర్తయ్యే 26 స్కూళ్లను ఎంపిక చేసి ఆ దిశగా వేగం పెంచారు. పాఠశాలల పునఃప్రారంభం గడువు సమీపించడంతో జిల్లా కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ శ్రీవత్స, డీఈవో వాసంతి, సెక్టోరియల్ అధికారి సుధీర్‌బాబుతో పాటు స్పెషల్ ఆఫీసర్లు, ఇతర అధికారులు పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధ్ది పనులపై ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల్లో స్పీడ్ పెంచుతున్నారు.