పర్వతగిరి, ఫిబ్రవరి 13: భక్తుల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్న ప్రసిద్ధ అన్నారం షరీఫ్ దర్గా ముస్తాబవుతున్నది. ఈ నెల 17 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సాయంత్రం యాకూబ్ షావళీబాబాకు గంధం సమర్పణ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఖవ్వాలి గేయాలాపాన కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. ఫకీర్ల విన్యాసాలతో అబ్బురపడే విధంగా సందల్ ఊరేగింపు నిర్వహించి అర్ధరాత్రి తర్వాత బాబాకు సమర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం దీపారాధన ఉంటుంది. శనివారం ఖత్ముల్ ఖురాన్ గ్రంధ పఠనం కార్యక్రమంతో ఉర్సు ముగుస్తుందని వెల్లడించారు. భక్తులు కులమతాలకతీతంగా తరలివచ్చి అన్నారం షరీఫ్‌ను దర్శించుకోనున్నారు. బాబాను దర్శించుకుంటే తమ కష్టాలు కడతేరుతాయని భక్తుల నమ్మకం.
అధిక సంఖ్యలో హాజరు కానున్న భక్తులు
మండల ప్రజలే కాకుండా రాయపర్తి, సంగెం, వర్ధన్నపేట, నెల్లికుదురు, నెక్కొండ, తొర్రూరు, మహబూబాబాద్‌తోపాటు జిల్లా నలుమూలల నుంచి, రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, అరబ్ దేశాల నుంచి యాత్రికులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై బాబాను దర్శించుకుని తరిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు వైఫల్యం చెందారనే ఆరోపణలు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా మెరుగైన వసతులు కల్పించాలని భక్తులు, యాత్రికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అదనపు బస్సులు అవసరం
అన్నారం షరీఫ్ దర్గా ఉర్సుకు పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు తరలిరానున్న నేపథ్యంలో అదనంగా ఆర్టీసీ బస్సులను ఉప్పరపెల్లి, గవిచర్ల, వర్ధన్నపేట, రాయపర్తి రూట్లలో నడిపించాలని ప్రజలు కోరుతున్నారు. ఉదయం నుంచి సాయం త్రం వరకూ అరగంటకో బస్సు నడుపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు రాత్రి 10 గంటల వరకు బస్సులు నడిపించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు, యాత్రికులకు ఎదైనా అనారోగ్య సమస్య తలెత్తుతే తక్షణమే చికిత్స అందించేలా జాతరలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు బందోబస్తును పకడ్బందీగా చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.