వరంగల్, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు గత ఏడాది కంటే మెరుగైన ర్యాంకు వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో నిర్వహించిన పోటీల్లో నగరం 115వ ర్యాంకు సాధించింది. శనివారం కేంద్ర పట్టణ, గృహ మంత్రిత్వ శాఖ ర్యాంకులు ప్రకటించింది. 2020 సంవత్సరంలో నిర్వహించిన పోటీల్లో గ్రేటర్ వరంగల్ 144వ ర్యాంకు సాధించగా, ఈ ఏడాది ర్యాంకును మెరుగుపర్చుకుంది. దేశవ్యాప్తంగా 4,320 నగరాలు పోటీ పడ్డాయి. మొత్తం ఆరు వేల మార్కులకు నగరం 3112.98 మార్కులు తెచ్చుకొని 115 ర్యాంకు సాధించింది. సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్ కేటగిరీలో 2400 మార్కులకు వరంగల్ నగరానికి 1526.98 మార్కులు వచ్చాయి. సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో 1800 మార్కులకు 1086.69 మార్కులు, సర్టిఫికెషన్ (చెత్త శుద్ధి చేసే విధానం) కేటగిరీలో 1800 మార్కులకు కేవలం 500 మార్కులు వచ్చాయి. ఇండోర్ కార్పొరేషన్ ఐదోసారి 1వ ర్యాంకు సాధించింది. 2వ ర్యాంకు సూరత్, 3వ ర్యాంకును విజయవాడ కైవసం చేసుకుంది. తెలంగాణ నుంచి గ్రేటర్ హైదరాబాద్ 13వ ర్యాంకు, కరీంనగర్ 74వ ర్యాంకు, రామగుండం 92వ ర్యాంకులు సాధించాయి.
ప్రాసెసింగ్ యూనిట్ లేక వెనుకబాటు
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో చెత్తశుద్ధి చేసే ప్లాంట్ లేకపోవడంతో స్వచ్ఛ సర్వేక్షణ్-2021 పోటీలో వెనుకబడింది. రోజూ సేకరించిన చెత్తలో 75 శాతం శాస్త్రీయంగా శుద్ధి చేయాలని స్వచ్ఛ సర్వేక్షణ్ నిబంధనలో ఉంది. అయితే, గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రాసెసింగ్ యూనిట్ లేకపోవడంతో మెరుగైన ర్యాంకు సాధించలేకపోయినట్లు అధికారులు తెలిపారు.
చెత్త శుద్ధిపై దృష్టి సారిస్తాం
స్వచ్ఛ సర్వేక్షణ్-2021 పోటీలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మెరుగైన ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది మరింత మెరుగైన ర్యాంకు కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. చెత్తశుద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. బయో మైనింగ్ ప్లాంట్ ఏర్పాటులో వేగం పెంచుతాం. ఆధునిక పద్ధతుల్లో చెత్త శుద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఆస్కీ సహకారంతో మానవ వ్యర్థ్యాల శుద్ధీకరణ సామర్థ్యాన్ని పెంచుతాం.