రైతులు పండించే ప్రతి గింజ సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఏ గ్రేడ్ రకం రూ.2060, సాధారణ రకానికి రూ.2040 చొప్పున క్వింటాల్‌కు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ములుగు జిల్లాలో సుమారు 55వేల ఎకరాల్లో వరి సాగు చేయగా లక్షా 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ సారి ఐకేపీ, ఉద్యాన శాఖ, పీఏసీఎస్, ఐటీడీఏల ద్వారా 155 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం సేకరణకు కావాల్సిన 20 లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచగా మిగిలినవి తెప్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. వడ్లు కాంటా అయిన వెంటనే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పిస్తున్నారు. ఏఈవోల సాయంతో వరి పండించిన రైతుల వివరాలను సేకరించి దానికి అనుగుణంగా కొనుగోళ్లు చేపట్టనున్నారు.
ములుగు, నవంబర్16 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్లో పండిన వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పంట చేతికి వచ్చిన ప్రాంతాల్లో నెలాఖరులో సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య ఆదేశాలివ్వడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంటాలు పూర్తి కాగానే నేరుగా అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2040 చొప్పున క్వింటాల్‌కు ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించింది. ఆయా గ్రామాల్లో ఏఈవోల సాయంతో వరి పండించిన రైతుల వివరాలు సేకరించి దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నారు.
జిల్లాలో సాగు నీటి సౌలభ్యం అధికంగా ఉండటంతో ఈ సీజన్లో రైతులు అధికంగా సుమారు 55 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కాగా, లక్షా 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. పండిన ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు ఐకేపీ, ఉద్యాన శాఖ, పీఏసీఎస్, ఐటీడీఏల ద్వారా 155 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 96 , ఐటీడీఏ ఆధ్వర్యంలోని జీసీసీ ద్వారా 23, డీఆర్డీఏ ఆధ్వర్యంలోని ఐకేపీల ద్వారా 34 కేంద్రాల తో పాటు ఉద్యాన శాఖ ద్వారా మరో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సేకరణకు 20లక్షల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచారు. మిగిలిన గన్నీ బ్యాగులు సరఫరా చేసుకునేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ధాన్యం నాణ్యత పరిశీలన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకే అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే అందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించేలా చర్యలు చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తూ కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లును పూర్తి చేశాం. వచ్చే నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గతంలో వలే ప్రారంభిస్తాం. ఇప్పటికే యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసి అనుమతుల కోసం ఉన్నతాధికారుల వద్దకు పంపించాం. 155 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు సైతం ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ప్రణాళితో ముందుకు సాగుతాం. రైతులు సైతం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు.
– పీ రాములు, పౌరసరఫరాల శాఖ మేనేజర్, ములుగు జిల్లా