వరంగల్, నవంబర్ 16 : ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరు నినాదంతో ఏర్పాటైన సహకార వ్యవస్థలోని సంఘాల సభ్యులు కష్టాల్లో ఉంటే తోడ్పాటు అందిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సహకార వారోత్సవాల్లో భాగంగా బుధవారం కల్పలత సూపర్బజార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార, గ్రంథాలయ, బాలల దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
సహకార వారోత్సవాలను పురస్కరించుకొని సహకార సంఘాల సభ్యుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకుంటామని చెప్పారు. వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేసి సంఘాల తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఎంజీఎంలోని సహకార సంఘాల్లో ఉన్న సభ్యులు మరణించారని, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న ముకీద్ అహ్మద్‌కు ఆయన 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. బాలల దినోత్సవం సందర్భంగా బాలల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో బడికి వెళ్లని, మానేసిన పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఆయన తెలిపారు. బాలకార్మికులను గుర్తించి బడికి పంపుతామని పేర్కొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గిఫ్ట్ ఏ బుక్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు అందజేస్తామని చెప్పారు.
పఠనాసక్తిని పెంచేలా పాఠశాలలు, గ్రంథాలయాల్లో సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. సహకార వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు కల్పలత సూపర్ మార్కెట్లో ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో కల్పలత సూపర్ బజార్ అధ్యక్షుడు వర్ధమాన్ జనార్దన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని జగన్మోహన్రావు, సూపర్ బజార్ ఉపాధ్యక్షుడు మహ్మద్‌షఫీ, డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, త్రిచక్ర ఆటో డ్రైవర్ల పొదుపు సంఘం అధ్యక్షుడు ఈసంపల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.