నర్సంపేటరూరల్, నవంబర్ 16: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎఫ్ఎల్ఎన్ నర్సంపేట మండల నోడల్ ఆఫీసర్ కొర్ర సారయ్య అన్నారు. బుధవారం మండలంలోని లక్నేపల్లి, ఇటుకాలపల్లి, మాదన్నపేట, నర్సంపేటలో ప్రైమరీ లెవల్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. లక్నేపల్లిలో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ సమావేశంలో నోడల్ ఆఫీసర్ సారయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. తొలిమెట్టు కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు రాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చూడాలని, ప్రతి ఉపాధ్యాయుడు బోధనలో మెళకువలు పాటించాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.
చెన్నారావుపేట: తొలిమెట్టు కార్యక్రమంతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగిందని తొలిమెట్టు నోడల్ అధికారి ఫ్లోరెన్స్ అన్నారు. చెన్నారావుపేట, జల్లి, పాపయ్యపేట గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల సమావేశాలు కాంప్లెక్స్ హెచ్ఎంల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఫ్లోరెన్స్ హాజరై మాట్లాడుతూ విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. టీచింగ్, లర్నింగ్ ఉపకరణాల ద్వారా విద్యార్థులకు బోధించాలని కోరారు. సమావేశాల్లో కాంప్లెక్స్ హెచ్ఎంలు సరళ, పాపమ్మ, రజిని, సెక్రటరీలు, రిసోర్స్ పర్సన్లు, సీఆర్పీలు పాల్గొన్నారు.
నల్లబెల్లి: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా విద్యా బోధన ఉండాలని ఎంఈవో చదువుల సత్యనారాయణ ఉపాధ్యాయులకు సూచించారు. మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎంఈవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. తరగతుల ప్లాన్, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన, పాఠశాలలకు హాజరు కాని విద్యార్థులపై ఫోకస్ పెట్టి స్కూల్కు రప్పించడం వంటి చర్యలతో పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలని సూచించారు. సమావేశంలో ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారి శ్రీనివాస్, హెచ్ఎం రామస్వామి, హెచ్ఎంలు పాల్గొన్నారు.