వరంగల్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు షురూ అయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల రాయపర్తిలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ ఏడాది సుమారు 1.40 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, దాదాపు 3,29,068 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇందులో 2.35 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాల్సి ఉండగా, 172 సెంటర్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన సర్కారు అదనంగా మరో రెండు కలిపి 174 కేంద్రాల ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది. వీటిలో 122 పీఏసీఎస్, 51 ఐకేపీ, మెప్మాకు ఒకటి కేటాయించింది. అవసరమైన ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రసాద్ చెప్పారు.
ఈ ఏడాది జిల్లాలో వరి పంట సాగు విస్తీర్ణం పెరిగినందున ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 174 సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాయపర్తిలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రా ల్లో సోమవారం ధాన్యం కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో ఏటా వానకాలం, యాసంగి ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ఈ క్రమంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. గత ఏడాది వానాకాలం జి ల్లాలో 172 సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిం ది. ఈ ఏడాది వానకాలం వరి సాగు విస్తీర్ణం గత ఏడా ది కంటే పెరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. సుమారు 1.40 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు ఈసారి ధాన్యం కొనుగోలు కోసం రూపొందించిన ప్రణాళికలో పేర్కొన్నారు.
దాదాపు 3,29,068 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందులో రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసేది, ఇతర అవసరాలకు వినియోగించేదిపోగా మిగిలే 2.35 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోలుకు గత ఏడాది మాదిరిగానే 172 సెంటర్ల ఏర్పా టు కోసం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ బీ గోపి ధాన్యం కొనుగోలులో భాగస్వాములయ్యే పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడుల అంచనాలు, ధాన్యం కొనుగోలు ప్రణాళికపై చర్చించారు. కొనుగోలుకు అవసరమైన గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్లు, టార్పాలిన్లతో పాటు రైస్‌మిల్లర్లకు ధాన్యం కేటాయిం పు, రవాణాపై అధికారులకు సూచనలు చేశారు. ధా న్యం దిగుబడులు పెరగనున్నందున అదనంగా మరికొన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం అదనంగా మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది. దీంతో మొత్తం 174 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి గౌరీశంకర్ గురువారం వెల్లడించారు. వీటిలో పీఏసీలకు 122, ఐకేపీకి 51, మెప్మాకు ఒకటి చొప్పున ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన తెలిపారు.
58.75 లక్షల గన్నీ సంచులు..
రైతుల నుంచి 174 సెంటర్ల ద్వారా 2.35 టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు 58.75 లక్షల గన్నీ సంచులు అవసరమని పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ప్రస్తుతం 21.50 లక్షలు కొత్త, 8.50 లక్షలు పాత గన్నీ సంచులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. వీటికి తోడు 10,22,500 కొత్త, 18,52,500 పాత గన్నీ సంచులు త్వరలో సంస్థ సరఫరా చేయనుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణకు 3,440 టార్పలిన్లు, 174 ప్యాడీ క్లీనర్లు, 174 తేమ కొలిచే యంత్రాలు, 174 వేయింగ్ మిషన్లు అవసరమని, ప్రస్తుతం అవసరానికి మించి 4,681 టార్పలిన్లు, 178 ప్యాడీ క్లీనర్లు, 181 తేమ కొలిచే యంత్రాలు, 385 వేయింగ్ మిషన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించేందుకు 120 రైస్‌మిల్లులు అందుబాటులో ఉన్నాయని, వీటిలో 95 రా, 25 బాయిల్డ్ మిల్లులు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ధాన్యం దిగుబడి ముందుగా వచ్చే రాయపర్తిలో కొనుగోళ్లు ప్రారంభం కాగా, వర్ధన్నపేట తదితర మండలాల్లో త్వరలో ప్రారంభిస్తామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రసాద్ చెప్పారు.
ఆరు సెక్టార్ల ద్వారా రవాణా..
సెంటర్లలో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆరు సెక్టార్ల ద్వారా రైస్‌మిల్లులకు ట్రాన్స్‌పోర్టు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఖానాపురం, నల్లబెల్లి, నెక్కొండ, పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట కేంద్రంగా అధికారులు సెక్టార్లను గుర్తించారు. ఖానాపురం సెక్టారులో ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి సెక్టార్లో నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ సెక్టార్లో నెక్కొండ, చెన్నారావుపేట, పర్వతగిరి సెక్టార్లో పర్వతగిరి, రాయపర్తి సెక్టార్లో రాయపర్తి, గీసుగొండ, వ రంగల్, వర్ధన్నపేట సెక్టార్లో వర్ధన్నపేట, సంగెం, ఖి లావరంగల్ మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఉన్నాయి. సెంటర్ల నుంచి ధాన్యాన్ని రైస్‌మిల్లులకు రవాణా చేయడానికి సెక్టార్ వారీగా ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు పౌర సరఫరాల సంస్థ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు ఖానాపురం, పర్వతగిరి సెక్టార్లలో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినట్లు ప్రసాద్ వెల్లడించారు.