వరంగల్, నవంబర్ 13 : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మడిపల్లిలో నిర్వహించిన మా సిటీ ప్లాట్ల వేలానికి విశేష స్పందన వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మా సిటీ ప్లాట్ల వేలం పాటలు జరిగాయి. తూర్పు ముఖం ఉన్న ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. మొదటి విడుత సెక్టార్-1లో మిగిలిన 25 ప్లాట్లలో 24 ప్లాట్లు, రెండో విడుత సెక్టార్ 2-లోని 57 రెసిడెన్షియల్ ప్లాట్లకు 27 ప్లాట్లు అమ్ముడుపోయాయి. మా సిటీ ప్లాట్లకు కుడా కనీస ధరగా రూ.8 వేల నుంచి రూ.9 వేలుగా నిర్ణయించింది. వేలంలో అత్యధికంగా గజానికి రూ.17,050 పలికింది. మా సిటీ వేలం పాటల ప్రాంగణంలో వివిధ బ్యాంకులతోపాటు ఎల్ఐసీ కొనుగోలుదారులకు రుణాలు అందజేసేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశాయి.
రాత్రి వరకు ప్లాట్ల వేలం
మడిపల్లిలోని మా సిటీ ప్లాట్ల వేలం పాటలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రాత్రి 7.30 గంటల వరకు సాగాయి. వేలం పాటలను కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, వైస్ చైర్పర్సన్ ప్రావీణ్య పర్యవేక్షణలో కుడా ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డి, కార్యదర్శి మురళీధర్‌రావు, ఈఈ భీమ్రావు నిర్వహించారు. మిగిలిన ప్లాట్ల వేలం తేదీలను త్వరలో ప్రకటిస్తామని కుడా అధికారులు తెలిపారు. రూ. 25 వేలు టోకెన్ అమౌంట్ చెల్లించి వేలం పాటల్లో పాల్గొని ప్లాట్లు దక్కించుకున్న వారు 3 రోజుల్లో 25 శాతం డబ్బులు చెల్లించాలని, 75 శాతం డబ్బులు 90 రోజుల్లో చెల్లించాలని అధికారులు ప్రకటించారు. అధికారులు ఊహించినట్లుగానే మా సిటీ ప్లాట్లకు భలే గిరాకీ వచ్చింది. ప్లాట్ల కొనుగోలుకు వచ్చిన వారికి కుడా అధికారులు అన్ని వసతులు కల్పించారు. మధ్యాహ్నం భోజన వసతితో పాటు మధ్యలో స్నాక్స్ అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
పారదర్శకంగా ప్లాట్ల వేలం
మా సిటీ ప్లాట్ల వేలానికి వచ్చిన స్పందన కుడాపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రభుత్వ ప రంగా పారదర్శకంగా ప్లాట్ల వేలం పాట లు నిర్వహిస్తున్నాం. కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సిటీ తరహాలో మా సిటీ ని అభివృద్ధి చేస్తాం. ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా మా సిటీని అభివృద్ధి చేస్తాం. కుడా అంచనాలకు తగ్గటుగా మా సిటీ ప్లాట్ల వేలానికి విశేష స్పందన వచ్చింది.
–సుందర్రాజ్ యాదవ్,కుడా చైర్మన్
సకల వసతులు కల్పిస్తాం
మా సిటీలో సకల వసతులు కల్పిస్తాం. విశాలమైన రోడ్లతో పాటు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పైపులైన్, కేబుల్ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తాం. గ్రీనరీతో పార్కులు నిర్మిస్తాం. మా సిటీలో ప్లాట్ల కొనుగోలుదారులకు కుడా అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం.
–ప్రావీణ్య,వైస్ చైర్పర్సన్, కుడా