వర్ధన్నపేట, నవంబర్ 13 : సాంకేతిక పరిజ్ఞానం ప్రగతికి సోపానమని, యువత జీవితంలో ఎదిగేందుకు దాన్ని ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఆదివారం వర్ధన్నపేట సర్కిల్ పరిధిలోని రాయపర్తి, జఫర్‌గఢ్, వర్ధన్నపేట మండలాలకు చెందిన యువకులు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ సహకారంతో 5కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి వరంగల్ సీపీ తరుణ్‌జోషి, ఎమ్మెల్యే అరూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పట్టణంలోని వివేకానంద సెంటర్ నుంచి ఇల్లంద బస్టాండ్ వరకు రన్ నిర్వహించారు. అనంతరం సీఐ సదన్‌కుమార్ ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు, డెబిట్ కార్డు వివరాలు, ఓటీపీ అడిగితే చెప్పవద్దని సూచించారు. యువత సమాజ హితం కోసం మాత్రమే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కోరారు. చెడు వ్యవసనాలకు దూరంగా ఉండాలన్నారు. అదేపనిగా సెల్ఫోన్లు చూస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. ఉద్యోగాల సాధన కోసం సెల్‌ఫోన్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
అప్రమత్తతే ఆయుధం..
సైబర్ నేరాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సీపీ తరుణ్‌జోషి సూచించారు. ప్రజలు ఫోన్లకు వచ్చే మెసేజ్‌లను చూసి మోసపోయి బ్యాంకు ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితిలో చెప్పవద్దన్నారు. నేరగాళ్లు అత్యంత చాకచక్యంగా వవరాలను తీసుకొని బ్యాంకు ఖాతాల నుంచి నగదును కాజేస్తారని వివరించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం కోసం 5కే రన్‌ను నిర్వహించిన వర్ధన్నపేట పోలీసులను అభినందించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన ముగ్గురికి సీపీ, ఎమ్మెల్యే సైకిళ్లను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాం, ఏసీపీ శ్రీనివాసరావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, ఎస్సైలు రామారావు, రాజు, మధవ్ తదితరులు పాల్గొన్నారు.