ఏటూరునాగారం, నవంబర్ 13 ;తక్షణమే స్పందిస్తున్న అధికారులు.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 100మందికి లబ్ధిఅనారోగ్యంతో బాధపడుతున్నా, అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారా.. ఉన్నత చదువులకు డబ్బులు లేవా.. ఆటల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నా వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేదా అయితే ఇలాంటి వాటన్నింటికి తీర్చేందుకు ఐటీడీఏ అండగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అందించే వివిధ పథకాలతో సంబంధం లేకుండా టీఆర్ఎఫ్(ట్రైబల్ రిలీఫ్ ఫండ్) ద్వారా కష్టకాలంలో ఆదుకుంటూ భరోసా ఇస్తున్నది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలోని 100మంది నిరుపేదల గిరిజనులకు సుమారు రూ.25లక్షలు అందించి వారి కష్టాలు తీర్చగా, సహాయం కోరి వచ్చి ప్రతి ఒక్కరినీ ఆసరా అవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఆర్ఎఫ్ పథకం ఎంతోమందికి బాసటగా నిలుస్తుంది. అందించే ఆర్థిక సహాయం ఎంతనేది ముఖ్యం కాదు. తాను అండగా ఉన్నాననే భరోసా ఇస్తుంది టీఆర్ఎఫ్. అనేకమంది అన్నార్తుల బాధలను తీరుస్తున్నది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారికి తక్షణమే రూ.25వేల వరకు చెక్కు రూపంలో ఐటీడీఏ అందించే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నిరుపేద గిరిజనులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఏప్రిల్లో శనగకుంటలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండ్లు కాలి నిరాశ్రయులైన 32 కుటుంబాలకు రూ.25వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు 25 కిలోల బియ్యం, రూ.1800 విలువ చేసే అన్ని రకాల నిత్యావసర సరకులను కూడా పంపిణీ చేశారు. అలాగే రూ.2లక్షల విలువ చేసే పరుపులు, చీరెలు, ధోవతులు, మెత్తలు, బెడ్షీట్లు కూడా బాధితులకు అందజేశారు.
ఎంతోమందికి ఆర్థిక సహాయం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ పథకం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అనేక మండలాలకు చెందిన గిరిజన గ్రామాల ప్రజలకు వీటిని అందించారు. వైద్య సహాయం, ఇండ్లు కాలిపోయిన బాధితులు, ఉన్నత చదువులకు, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు, మృతిచెందిన కుటుంబాలకు, వరద ముంపునకు గురైన వరద బాధితులకు ఈ పథకం కింద లబ్ధిపొందే అవకాశం ఉంది. ఈ పథకం కింద ఇటీవలి కాలంలో సుమారు 100మంది గిరిజన కుటుంబాలకు అవసరాన్ని బట్టి ఆర్థిక సహాయం అందించారు. ఏటూరునాగారం మండలంలో తొమ్మిది, భూపాలపల్లి మండలంలో ఇద్దరు, గంగారం మండలంలో ఇద్దరు, గోవిందరావుపేట మండలంలో ఇద్దరు, గూడూరు మండలంలో ఇద్దరు, కన్నాయిగూడెం మండలంలో ఒక్కరు, ఖానాపూర్ మండలంలో ఏడుగురు, కొత్తగూడ మండలంలో ఒక్కరు, మహబూబాబాద్ మండలంలో ముగ్గురు, మంగపేట మండలంలో 42, ములుగు మండలంలో ఐదుగురు, నల్లబెల్లిలో ఒక్కరు, నర్సంపేట మండలంలో ఇద్దరు, తాడ్వాయి మండలంలో ఎనిమిది, వెంకటాపురం మండలంలో ఒక్కరు, వెంకటాపురం(నూగూరు) మండలంలో ఇద్దరు, వాజేడు మండలంలో ఒక్కరు, వర్ధన్నపేటలో ఒక్కరు, నెక్కొండలో ఒక్కరికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించారు. ఇప్పటివరకు 90మంది గిరిజన బాధితులకు సుమారు రూ.25లక్షల వరకు ఐటీడీఏ అధికారులు అందజేశారు.
ఆర్థిక పథకాలతో సంబంధం లేకుండా..
ఐటీడీఏ ద్వారా గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈఎస్ఎస్, ఎంఎస్ఎంఈ లాంటి పథకాల ద్వారా గిరిజనులను ఎంపిక చేసి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నారు. వీటన్నింటికి సంబంధం లేకుండా కేవలం గిరిజనులు అత్యవసర సమయంలో అండగా నిలిచేందుకు టీఆర్ఎఫ్ ద్వారా సహాయం అందచేస్తున్నారు. అయితే దీని ద్వారా బాధిత గిరిజనులు ఎంతో కొంత ఊరట పొందుతున్నారు. కొంతమంది గిరిజన విద్యార్థులు ఇతర రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే క్రీడాపోటీలకు ఎంపికవుతున్నారు. కానీ డబ్బులు లేక పాల్గొనలేక వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికి కూడా ఈ పథకం ఆదుకుంటున్నది. మలేషియాలో జరిగే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు వర్ధన్నపేటకు చెందిన బానోత్ ప్రశాంత్, నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన మాలోత్ శేఖర్ ఎంపికయ్యారు. పాల్గొనేందుకు ఆర్థిక సహాయం అందించాలని వారి తల్లిదండ్రులు ఐటీడీఏ పీవోకు విన్నవించగా దీంతో టీఆర్ఎఫ్ నుంచి రూ.20వేల చొప్పున ఇద్దరికీ గత నెల 31న ఐటీడీఏ పీవో అంకిత్ చెక్కులు అందజేశారు. ఇలా అనేక రకాలుగా టీఆర్ఎఫ్ కింద నిరుపేద గిరిజనులను ఆదుకునే అవకాశం ఉంది. బాధితులు ఐటీడీఏను ఆశ్రయిస్తే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.