వర్ధన్నపేట, నవంబర్ 13: నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట పట్టణ సమీపంలో మున్సిపాలిటీ పాలక మండలి, పట్టణ ప్రముఖులు, ముఖ్య నాయకులతో ఆదివారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ పట్టణంతోపాటు విలీన తండాల్లో ఇప్పటికే రూ. 35 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. వాటితోపాటు కోనారెడ్డి, లింకురోడ్లు, అంతర్గత రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మొత్తంగా రూ. 83.87 కోట్లు కేటాయించిందని వివరించారు. ఈ నిధులతో ఎంపిక చేసిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే, పట్టణ పరిధిలోని ప్రజలకు ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ తదితర సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి సుమారు రూ. 64.41 కోట్లు అందుతున్నట్లు వెల్లడించారు.
రానున్న రోజుల్లో పట్టణంతోపాటు విలీన గ్రామాల ప్రజల సంక్షేమం కోసం మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కోరారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ప్రజల కోసం పనిచేసినప్పుడే కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీకి మంచి పేరు వస్తుందని గుర్తుచేశారు. పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామన్నారు. ఏమైనా అంతర్గత సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, పార్టీ నాయకులు పులి శ్రీనివాస్, ఎండీ అన్వర్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.