ఖిలావరంగల్, నవంబర్ 9: జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఓటరు జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీ గోపి విడుదల చేశారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కవగా ఉండడం విశేషం. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 7,00,496 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,46,522 మంది, మహిళలు 3,53,801 మంది, ట్రాన్స్‌జెండర్స్ 173 మంది ఉన్నారు. గురువారం నుంచి వచ్చే నెల 8 వరకు క్లయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వచ్చే నెల 26న పరిశీలించి జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రచురుణకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26, 27, వచ్చే నెల 10, 11వ తేదీల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు, అలాగే ఓటరుగా నమోదు కానివారు, ఓటరు జాబితాలో తప్పులు, సవరణల గురించి అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌ను పౌరులు తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని తమ ఓటు హక్కును తెలుసుకోవచ్చని సూచించారు. అలాగే, ఓటరు నమోదు, తప్పులు సరిచేసుకునేందుకు, పోలింగ్ స్టేషన్ మార్పు, తొలగింపులు కూడా చేసుకోవచ్చని తెలిపారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు విద్యావ్యాప్తి దిశగా చైతన్యం కలిగించేందుకు జిల్లా విద్యాశాఖ, నోడల్ అధికారి అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి
పోచమ్మమైదాన్: యువతీ యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ బీ గోపీ సూచించారు. వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్పై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో నమోదు చేసుకునే విధంగా చూడాలని కోరారు. బుధవారం జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఎలక్ట్రోరల రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయంలో సమగ్ర ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించినట్లు తెలిపారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూల్ లెవల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబితా, సంబంధిత ఫారాలతో అందుబాటులో ఉంటారని తెలిపారు. సమావేశంలో కళాశాల సెక్రటరీ చందా విజయ్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ శశిధర్రావు, తహసీల్దార్ సత్యపాల్‌రెడ్డి, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ పీ రవి, పలువురు బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, సీకేఎం కళాశాల అధ్యాపకులతో సమావేశమై కళాశాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీకేఎం ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఎంజీఎంలో సదరం క్యాంపు సందర్శన
వరంగల్ చౌరస్తా: దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు ఎంజీఎంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న సదరం క్యాంపును కలెక్టర్ గోపి బుధవారం సందర్శించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డితో కలిసి క్యాంపును సందర్శించి వైద్యాధికారులకు సూచనలు చేశారు. క్యాంపునకు హాజరైన దరఖాస్తుదారులతో మాట్లాడారు. అనంతరం ఎంజీఎం ఆవరణలో పారిశుధ్య పనులు, వంటశాల, విభాగాల్లో వైద్య సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో రోజుకు 30 మంది చొప్పున మూడు రోజులపాటు సదరం క్యాంపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి రోజు 18 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంట ఎంజీఎం ఆర్ఎంవో డాక్టర్ మురళి ఉన్నారు.