సొంతూరిపై మమకారంతో చేతనైన సాయం చేస్తున్నాడు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి పట్నంలో స్థిరపడినా ఉన్న ఊరిని మరువకుండా అభివృద్ధికి కోసం పాటుపడుతున్నాడు. లక్షలాది రూపాయలతో చిరువ్యాపారుల కోసం షెడ్లు, పల్లె ప్రకృతి వనంలో పిల్లల కోసం ఆటవస్తువులు, అంత్యక్రియలకు కష్టం కాకుండా స్వర్గరథం, ఫ్రీజర్.. ఇలా అన్ని రకాలుగా సాయం చేస్తూ గ్రామాభివృద్ధికి ఇతోధిక సాయం అందిస్తున్నాడు ఉప్పల్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకుడు స్వర్గం రవి.
– కమలాపూర్, అక్టోబర్ 12
కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన స్వర్గం రవి స్వగ్రామంపై మమకారంతో అన్ని విధాలా అభివృద్ధికి చేయూతనిస్తున్నాడు. చిరు వ్యాపారుల సముదాయాల నిర్మాణం కోసం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద రూ.4లక్షలతో షెడ్ల నిర్మాణానికి కృషి చేశారు. 10వేల జనాభా ఉండే మేజర్ పంచాయతీ కావడంతో సుమారు రూ.8లక్షలతో స్వర్గ రథం, శవాన్ని భద్రపరిచే ఫ్రీజర్ సమకూర్చారు. సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు లక్షా 50వేలతో బోరు వేయించారు. అలాగే పార్కులో పిల్లలు ఆడుకునేందుకు రూ.2.50 లక్షలతో ఆటవస్తువులు కొనుగోలు చేసి ఇచ్చాడు. దీంతో పల్లె ప్రకృతి వనంలో పిల్లల ఆటాపాటలతో సందడి నెలకొంది. అంతేకాకుండా గ్రామంలోని బడి, గుడి, కుల సంఘాల భవన నిర్మాణాలకు, పేదవారు మరణిస్తే ఆర్థిక సహాయం చేస్తూ నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నాడు. వ్యాపారపరంగా అమెరికాలో స్థిరపడిన కొడుకు సాయి, కుటుంబ సభ్యులకు సొంత ఊరు బాగుకోసం పనిచేయాలని సూచిస్తూ గ్రామాభివృద్ధికి ఏం కావాలన్నా నిధులు ఇస్తుండడం విశేషం.
సేవలు మరువలేనివి
గ్రామంలో అభివృద్ధికి నిధులు కావాలని స్వర్గం రవికి చెప్పిన వెంటనే కాదనకుండా ఇస్తుంటారు. గుడి, బడితో పాటు పేదలకు ఆర్థిక సహాయం చేస్తారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పని కోసం సాయం అడిగినా వెంటనే స్పందిస్తా రు. ఇచ్చిన డబ్బులతో పనులు పూర్తి చేస్తున్నం. గ్రామాభివృద్ధికి వారు అందిస్తున్న సహకారం, ప్రజలకు చేస్తున్న సేవ మరవలేనిది.
– ఎర్రబెల్లి దేవేందర్‌రావు, సర్పంచ్, ఉప్పల్
జీవితాంతం సేవ చేస్తా
నేను పుట్టక ముందే ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. గ్రామంలో కనీస మౌలిక వసతులు ఉండాలి. దేవుడిచ్చిన సంపాదనలో కొంత సొంత ఊరి కోసం ఖర్చు చేస్తున్నా. అవి ప్రజలకు ఉపయోగపపడితే అంతకన్నా సంతృప్తి ఇంకేముంటుంది. ఊరిలో ఎవరైనా చనిపోతే వారి పిల్లలు దూరం నుంచి వచ్చేదాకా ఇబ్బంది ఉండవద్దని స్వర్గరథం, ఫ్రీజర్ తెప్పించాం. ప్రజలు ప్రయాణం చేసేందుకు భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎలాంటి నీడ సౌకర్యం లేదు. బస్సు షెల్టర్ నిర్మాణానికి కృషిచేస్తున్నా.
– స్వర్గం రవి