జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జూన్ పదో తేదీలోగా కొనుగోలు పూర్తి కావాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశారు. ప్రభుత్వ మద్దతు ధరతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ.1,960, కామన్ రకానికి రూ.1,940 మద్దతు ధర చెల్లిస్తున్నారు. ఇప్పటికే 13,546 మంది నుంచి 58,603 టన్నులు సేకరించారు. దీని విలువ రూ.114.81 కోట్లు. ఈ ధాన్యాన్ని కస్టమ్ మిల్డ్ రైస్(సీఎంఆర్) కోసం రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈసారి 78,244 ఎకరాల్లో వరి సాగు చేయగా, 1,86,707 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందుకు తగ్గట్లుగా 145 కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతల నుంచి వడ్లు సేకరిస్తున్నారు.
వరంగల్, జూన్ 4(నమస్తేతెలంగాణ) : జిల్లాలో రైతులు యాసంగిలో 78,244 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇందులో సన్న రకాల విస్తీర్ణం 59,187, దొడ్డు రకాల విస్తీర్ణం 19,056 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సన్నరకాల ధాన్యం 1,35,406, దొడ్డు రకాల ధాన్యం 51,301 టన్నులు ఉంటుందని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో తెలిపారు. కాగా, తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగి వడ్లను కొనేందుకు ససేమిరా అనడంతో రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది.
ఈమేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే అధికారులు యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. జిల్లాలో 1,86,707 టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 167 కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. తొలుత రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం, నెక్కొండ మండలాల్లోని గ్రామాల్లో కొనుగోళ్లను ప్రారంభించారు.
దశల వారీగా సోమవారం వరకు 145 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. చివరి గింజ వరకూ కొనేందుకు అన్ని కేంద్రాల్లోనూ మౌలిక వసతులు కల్పించారు. మొదట ప్రారంభించిన ఐదు కేంద్రాల్లో వడ్ల సేకరణ పూర్తయింది. దీంతో ఈ ఐదు కొనుగోలు కేంద్రాలను అధికారులు మూసేశారు. నర్సంపేట రెవెన్యూ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలవుతున్నాయి. ఫలితంగా ఈ ప్రాంతాల్లో ప్రతిపాదించిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది.
యాసంగి ధాన్యం కొనుగోలుకు మంజూరైన 167 కేంద్రాల్లో ప్రభుత్వం పీఏసీఎస్‌లకు 118, ఐకేపీకి 49 కేటాయించింది. ఈ నేపథ్యంలో పీఏసీఎస్ లు నిర్వహిస్తున్న కేంద్రాల్లో ఎక్కువగా ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన 58,603 టన్నుల ధాన్యం లో పీఏసీఎస్‌లు కొనుగోలు చేసింది 35,707 టన్ను లు ఉండడం గమనార్హం. ఐకేపీ కేంద్రాల్లో 22,896 టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. 58,603 టన్నుల ధాన్యంలో సన్నరకాలది 38,812, దొడ్డు రకాలది 17,036 టన్నులుగా ఉంది. 145 కేంద్రాల్లో కొనుగోలు చేసిన 58,603 టన్నులధాన్యం నుంచి అధికారులు 55,848 టన్నులను సీఎంఆర్ కోసం జిల్లాలోని రైస్‌మిల్లులకు తరలించారు. మరో 2,755 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు తరలించాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం అమ్మిన రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు.
– ఇర్ఫాన్, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ
యాసంగి ధాన్యం కొనుగోలు జూన్ పదోతేదీ వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గడువుకు ముందే అంటే జూన్ ఐదో తేదీ వరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. రైతులు ఆలస్యంగా వరి నాట్లు వేయడం వల్ల నర్సంపేట ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కోతలు మొదలవుతున్నాయి. ఈ ప్రాంతంలోని కొన్ని కేంద్రాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు మొదలు కాలేదు. అయినా నిర్దేశిత గడువులోగా అన్ని కేంద్రాల్లో కొనుగోలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వర్ధన్నపేట ప్రాంతంలోని పలు సెంటర్లలో ధాన్యం కొనుగోలు పూర్తయింది. ఆ సెంటర్ల నుంచి ధాన్యాన్ని రైస్‌మిల్లులకు కూడా తరలించాం. ఇప్పటివరకు 145 కేంద్రాల ద్వారా 58,603 టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది.