జయశంకర్ భూపాలపల్లి, జూన్ 25 తెలంగాణ): జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు పెరుగుతున్నాయని, అవగాహన కల్పించి సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాలు 36శాతం మాత్రమే జరుగుతున్నట్లు గణాంకాలు ఉన్నాయని, దీంతో 70 శాతానికి పెంచాలని మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు నెలన్నరగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
సాధారణ ప్రసవాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సిజేరియన్ ఆపరేషన్లు చేసే హాస్పిటళ్లను ఆడిట్ చేయనున్నారు. తొలుత పీహెచ్‌సీల వారీగా అవుట్ పేషెంట్ల జాబితా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు చేసేందుకు గర్భిణులతోపాటు వారి కుటుం బ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని వైద్యాధికారులు పీహెచ్‌సీల్లో తప్పకుండా నార్మల్ డెలివరీలు చేయాలని, నెలలో ఐదుకు తగ్గొద్దని నిర్ణయిం చారు. సబ్‌సెంటర్ల వారీగా రిపోర్ట్ ఇవ్వాలని, వాటిపై రివ్యూ చేయాలనే ఆదేశించారు. డాక్టర్లు పీహెచ్‌సీల్లో విధుల్లో ఉన్న ఫొటోలను రోజూ వాట్సాప్ గ్రూప్‌లో అప్లోడ్ చేయాలనే సూచించారు. గర్భిణుల నమోదు వంద శాతం ఉండేలా చూస్తున్నారు.
జిల్లాలో 13 పీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీల పరిధిలో సాధారణ ప్రసవాలు 60 శాతానికి పెరిగాయి. మేలో 91 ప్రసవాలు జరగ్గా, ఇందులో 50 సాధారణ ప్రసవాలు, 41 సిజేరియన్ ఉన్నాయి. అంటే సాధారణ ప్రసవాల సంఖ్య 40 శాతం పెరిగింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో సిజేరియన్ ప్రసవాలు ఎకువగా చేస్తున్నట్లు తెలుస్తున్నందున చర్యలు తీసుకోనున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య త్వరలోనే 70శాతానికి చేరుతుంది. ఇప్పటికే 60శాతానికి చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు ఏఎన్ఎం, ఆశ, సబ్ సెంటర్ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నాం. సాధారణ ప్రపవాల వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాం.
– డాక్టర్ జీడి తిరుపతి, సూపరింటెండెంట్, వంద పడకల దవాఖాన, జయశంకర్ భూపాలపల్లి