తొలకరి పలకరింపుతో ఎన్నో ఆశలతో కర్షకులు సాగుకు సన్నద్ధమయ్యారు. విత్తన కొనుగోళ్లలో తలమునకలయ్యారు. ఇదే అదనుగా కొందరు నకిలీ విత్తన వ్యాపారులు రంగంలోకి దిగారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి నకిలీ, నిషేధిత విత్తనాలు తీసుకొచ్చి రైతులను మాయచేస్తున్నారు. భూపాలపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో రాత్రివేళల్లో తక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు వ్యవసాయాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో టాస్క్ ఫోర్స్ అధికారులు విత్తన షాపుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. బ్రాండెడ్ కంపెనీల లేబుల్‌లతో విత్తనాలను కల్తీ చేసి అమ్మే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని.. నకిలీలను నమ్మి మోసపోవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
భూపాలపల్లి టౌన్, జూన్ 21 : తొలకరి పలకరింపుతో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో సాగు పనులు ప్రారంభించారు. కొందరు వరినార్లు పోసుకుంటుండగా వర్షాధార పంటలను సాగు చేసే వారు విత్తనాలు విత్తుతున్నారు. ఇదిలా ఉండగా నకిలీ విత్తన వ్యాపారులు రంగంలోకి దిగారు. మహారాష్ట్ర, వరంగల్, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి నకిలీ, నిషేధిత విత్తనాలను రైతుల వద్దకు తెచ్చి మాయ చేస్తున్నారు. అంతేకాకుండా పల్లెల్లో విక్రయాలు జరుపుతున్నట్లు వ్యవసాయ అధికారులకు సమాచారం అందిం ది. లైసెన్సుల వ్యాపారుల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, ఆదమరిస్తే మొదటికే మోసం వస్తుందని అధికారులు కర్షకులకు సూచిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేయడమే తప్ప వాటి స్థితిగతులను గమనించకపోవడంతో రైతన్నలు ఏటానష్టాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పత్తి, వరి, మొక్కజొన్న, పెసరు, కంది, కూరగాయల విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే లాభాల బాట పండించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతుండగా దళారులు నకిలీ విత్తనాలను రైతుల ముంగిట్లోకి తీసుకవస్తున్నారు. తాము అందించే విత్తనాలకు కలుపు మందులు అవసరం లేదని నమ్మిస్తూ విక్రయిస్తున్నారు. భూపాలపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో రాత్రి వేళల్లో తక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు వ్యవసాయాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. కొనుగోలు చేస్తున్న రైతులు నకిలీ వ్యాపారులను ముందే గుర్తించి అధికారులకు సమాచారం అందించకుండా, తీరా పంట నష్టం జరిగాక అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఫలితం లేకుండా పోతుంది.
జిల్లాలో ఎక్కువగా పత్తి, వరి అధికంగా పండిస్తారు. అయితే వర్షాలు కురుస్తుండడంతో రైతులు హడావుడిగా ఫర్టిలైజర్స్ షాపులో లేదా గ్రామాల్లో అనుమతి లేకుండా నిర్వహించే దుకాణాల్లో విత్తనాలు కొంటుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుండడంతో నాణ్యత లేని విత్తనాలైనా సరే రైతులు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు.
విత్తనాలపై రైతులు అవగాహన పెంచుకో వాలి. గత ఏడాది ైగ్లెకోసిల్ గడ్డి మందును నిషేధించాం. అయితే ఈ సారి వ్యవసాయ అధికారుల అనుమతితో పిచికారీ చేసేందు కు అనుమతి ఉంది. గ్రామాల్లో ఎవరైనా డీఏపీ, యూరియా, పొటాషియం తక్కువ రేటుకు అమ్ముతామని చెబితే వెంటనే ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే 50 శాతం షాపులను తనిఖీలు చేశాం. బ్రాండెడ్ కంపెనీల లేబుల్‌లతో విత్తనాలను కల్తీ చేసి అమ్మే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణంలోనే కొనుగోలు చేయాలి. బీటీ-3 , హెచ్‌టీ కాటన్ విత్తనాలపై జాగ్రత్తగా ఉండాలి. ‘మన తెలంగాణ.. మన వ్యవసాయం’ కార్యక్రమంలో నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాం.
– విజయ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, జయశంకర్ భూపాలపల్లి