సుబేదారి, జూన్ 21 : రూ.లక్ష ఇస్తే రూ.రెండు లక్ష లు, తులం బంగారం ఇస్తే రెట్టింపు బంగారం ఇస్తామని అమాయక ప్రజలను మోసం చేసిన ముగ్గురిని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండ సుబేదారిలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ మంగళవారం నిందితుల వివరాలు వెల్లడించారు. హనుమకొండ పరిమళ కాలనీకి చెందిన సయ్యద్ సహేదా, భర్త పోలీస్ కానిస్టేబుల్ సయ్యద్ ఖాసీం, తులసేగారి రాజబాబు తక్కువ సమయంలో భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలనున్నారు.
దీంతో హనుమకొండ ప్రశాంత్‌నగర్‌కు చెందిన గుడిపాటి లక్ష్మి, కాజీపేటకు చెందిన శ్రీలతను వారు పరిచయం చేసుకున్నారు. రూ.లక్ష ఇస్తే రూ.రెండు లక్షలు ఇస్తాం, తులం బంగారం ఇస్తే రెండు తులాల బంగారం ఇస్తామని లక్ష్మి, శ్రీలతతో పాటు మరికొంత మందిని సహేదా, ఖాసీం, రాజబాబు నమ్మించారు. వారి నుంచి రూ.1.75 కోట్లు వసూలు చేశారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులు సహేదా, ఖాసీం, రాజబాబును మంగళవారం అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. వారి నుంచి రూ.5.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ చాటిన టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీనివాస్‌జీ, సంతోష్ సిబ్బందిని అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందించారు.