హనుమకొండ, జూన్ 8 : జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. టెట్ నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే మొదటి పేపర్ పరీక్షకు 13,752 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే రెండో పేపరుకు 12,377 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు.
పరీక్ష నిర్వహణకు 58 సెంటర్లు, 12 మంది రూట్ ఆఫీసర్లు, 730 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు సంధ్యారాణి తెలిపారు. అలాగే, ప్రతి సెంటర్ వద్ద ఫ్లయింగ్ స్కాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నాపత్రాలను సకాలంలో పరీక్షా కేంద్రాలకు తరలించడానికి, పరీక్ష అనంతరం హైదరాబాద్‌కు తరలించేందుకు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రతి పరీక్ష కేంద్రంలో నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్డీవోలు, సంబంధిత అధికారులు తమ పరిధిలోని కేంద్రాల్లో మౌలిక వసతులు పరిశీలించాలని, పరిసరాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, పరీక్షా కేంద్రం వద్ద వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రంలో మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలు మూసి వేయించాలని ఆదేశించారు. విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదన్నారు. లైన్ డిపార్డ్మెట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వాసు చంద్ర, డీఈవో రంగయ్య నాయుడు, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
కమలాపూర్ : పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులను అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆదేశించారు. మండలంలోని శనిగరం, మర్రిపెల్లిగూడెం గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామాల్లో శానిటేషన్ పనులు నిరంతరంగా కొనసాగాలన్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి మూడు పూల మొక్కలు ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు.
తడి, పొడి చెత్త వేరు చేసి వర్మీ కంపోస్టు తయారు చేయాలన్నారు. ఇంకుడు గుం త, మరుగుదొడ్డి ఉంటేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కార్యదర్శులను ఆదేశించారు. శనిగరంలో నర్సరీ, శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు పనులను పర్యవేక్షించారు. మర్రిపెల్లిగూడెంలో పాఠశాలను సందర్శించారు. మౌలిక వసతులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాణి, ఎంపీడీవో రవి, ఏపీవో రమేశ్, సర్పంచ్‌లు పింగిళి రవళి రంజిత్‌రెడ్డి, ఇనుగాల కిరణ్మయి విజయ్, ఈసీ కార్తీక్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.