ఎల్కతుర్తి, జూన్ 8 : రాష్ట్ర అప్పుల పాలైందని ప్రతిపక్షాలు దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నాయి.. అవి ఎంత మాత్రం నిజం కావు.. వచ్చే 30 ఏండ్లలో ఆ అప్పులు తీర్చుకునే వెసులుబాటు ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, రోడ్లు, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.. ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అప్పులు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఐదో విడుత పల్లెప్రగతిలో భాగంగా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ను బుధవారం ఆయన సందర్శించారు.
సర్పంచ్ మాసిపెద్ది భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. మొదట పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రధాని మోదీ 8 ఏండ్లలో 120 శాతం మేర అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారని, ఇప్పుడు కరంటు క్షణమైనా పోతుందా అన్నారు.
పట్టణాల్లో ఉండే వసతులు గ్రామాల్లో ఉండాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఆకాంక్షించేవారని, ఆయన మాటలను సీఎం కేసీఆర్ పల్లెప్రగతి రూపంలో నిజం చేశారని కొనియాడారు. దేశంలో తెలంగాణలో తప్ప తడి, పొడి చెత్త బుట్టలు, గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఎక్కడా లేవని పేర్కొన్నారు. పల్లెప్రగతితో గ్రామాల్లో శుభ్రత పెరిగి రోగాలు తగ్గాయని, దవాఖానల్లో కూడా రోగుల సంఖ్య తగ్గుతోందని వివరించారు. గోదావరి, కృష్ణా జలాలను తరలించి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని, మినరల్ వాటర్ బాటిల్ కంటే భగీరథ నీళ్లే మంచివని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతోనే విద్యుత్, నీళ్ల సమస్య తీరిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ అని పేరు పెట్టి చెరువులను బాగు చేసుకుందామని ఉద్యమ కాలంలో సీఎం చెప్పారని గుర్తు చేశారు.
ఇందులో భాగంగానే 44వేల చెరువులను బాగు చేసుకున్నామని తెలిపారు. 3 ఏండ్లు కరువు వచ్చినా సరిపడా భూగర్భ జలాలున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో చెరువులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. వర్షాలు పడి తెగి నీళ్లన్నీ నదుల్లో పడి ఆంధ్రాకు తరలిపోయేవని చెప్పారు. చెరువుల లోతుతో నీలివిప్లవం తెచ్చుకొని ముదిరాజ్‌ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత కూడా అందించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 9గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపికకావడం గర్వకారణమన్నారు. పిల్లలకు సెల్ఫోన్లు కాకుండా క్రీడలు ఆడించాలనే సదుద్దేశంతో క్రీడామైదానాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఈ లైబ్రరీలను కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. మన ఊరు-మనబడికి ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించిందని తెలిపారు.