జనగామ, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రజల సమస్యలు వింటూ.. కాలనీల్లో వసతులు పరిశీలిస్తూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. పట్టణ ప్రగతిలో భాగంగా జనగామలోని రెండు వార్డుల్లో 2 గంటలకు పాటు ఆయన పాదయాత్ర చేపట్టి అధికారులను హడలెత్తించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 13, 15వ వార్డుల్లో చైర్పర్సన్ పోకల జమున, కౌన్సిలర్లు మల్లిగారి కళావతి, మారబోయిన పాండుతో కలిసి గల్లీగల్లీ తిరిగిన ఆయనకు ప్రజలు పూలాభిషేకం చేస్తూ ఘనస్వాగతం పలికారు. తొలుత 13వ వార్డులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముత్తిరెడ్డి పాదయాత్రగా కాలనీలను పరిశీలించారు.
తాగునీటి సరఫరా సరిగా ఉందా?, మున్సిపల్లో శానిటేషన్ ఎలా ఉంది? మోరీలు తీస్తున్నారా? వీధిలైట్లు వెలుగుతున్నాయా? కౌన్సిలర్ అందుబాటులో ఉంటున్నాడా? అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో డ్రైనేజీ సరిగా శుభ్రం చేయడం లేదని, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వస్తుండడాన్ని గమనించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో హరితహారం మొక్కలను సంరక్షించడం, గ్రీనరీ పెంచడం వంటి అంశాలపై నిర్లక్ష్యం చేయడం సరికాదని కమిషనర్‌ను మందలించారు. 13వ వార్డులో అర్భన్ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే అన్ని గదులను తిరిగి చూసి బయట ఉన్న బాత్రూం గది తలుపులు ఊడిపోవడం, బేసిన్ పగిలి పోవడం చూసి వాటిని మరమ్మతు చేయించేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించాలని అక్కడే ఉన్న ఎన్ఆర్ఐ వీరారెడ్డి భాస్కర్‌రెడ్డిని కోరారు.
అర్భన్ పీహెచ్సీలో మరిన్ని వసతులు ఉండాలని, మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సర్కారు దవాఖానలను తీర్చిదిద్దాలని అధికారులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. ఆస్పత్రి ఓపీలో శిశువును ఎత్తుకొని కూర్చున్న మహిళ వద్దకు వెళ్లి ఎక్కడ ప్రసూతి అయ్యావు..? ఎన్నో కాన్పు? ఇక్కడకు ఎందుకు వచ్చావ్? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ అయినట్లు చెప్పడంతో ఎంత ఖర్చయింది?..ప్రభుత్వ దవాఖానలో నార్మల్ డెలివరీలు చేస్తున్నారు కదా? ప్రసూతి సాయం అందించి కేసీఆర్ కిట్ ఇస్తున్నారు కదా..ప్రైవేట్‌కు వెళ్లడం వల్ల ఎంత నష్టపోయావో తెలుసా? బయట సీజేరియన్ చేశారు కదా తల్లీ ..
అంటూ ఆమెకు ఎమ్మెల్యే హితబోధ చేశారు. ఆస్పత్రి బయట ఎండిపోయిన చెట్టును చూసి ఇలా ఎందుకు జరిగిందో పరీక్షించి చూసిన ఎమ్మెల్యే మొక్కలను నాటడం కాదు.. వాటికి ఎండాకాలంలో నీళ్లు పోయాలి, అప్పుడే అవి జీవిస్తాయని మున్సిపల్ సిబ్బందికి హితవు పలికారు. నాలుగు వార్డులకు సంబంధించిన శ్మశాన వాటికను సందర్శించిన ముత్తిరెడ్డి మరిన్ని సదుపాయాల కోసం పట్టణ ప్రగతిలో వైకుంఠధామం నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయించాలని ఆదేశించారు.
15వ వార్డులో స్లాటర్హౌజ్ను పరిశీలించిన ఎమ్మెల్యే రూ.50 వేలతో వసతులు కల్పించాలని సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న బీసీ హాస్టల్ భవనం, ప్రాంగణాన్ని క్రీడామైదానంగా అభివృద్ధి చేయాలన్నారు. రైల్వే పరిసరాలను పరిశీలించి రైల్వే అండర్ బ్రిడ్జి కింది నుంచి అంబులెన్స్ వెళ్లడం లేదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఆయన వెంట జనగామ మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు మల్లిగారి రాజు, ఉడుగుల నర్సింహులు, కిష్టయ్య, పసుల ఏబెల్, లెనిన్, పానుగంటి ప్రవీణ్, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
జనగామ చౌరస్తా : జనగామ పట్టణంలో 6వ రోజు ‘పట్టణ ప్రగతి’ జోరుగా సాగింది. బుధవారం అంబేధ్కర్ నగర్ 1వ వార్డు ఏరియాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పర్యటించారు. వార్డులో రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి చెట్లను తొలగింపజేసి డ్రైనేజీలను శుభ్రం చేయించారు. వార్డులో మొక్కలు నాటడానికి అనువైన ప్రదేశాలను గుర్తించి గుంతలు తవ్వాలని సంబంధిత శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్, కౌన్సిలర్ రామగల్ల అరుణావిజయ్కుమార్, వార్డు స్పెషల్ ఆఫీసర్ షబనా, వార్డు ఆఫీసర్ పీ సోమయ్య, శానిటరీ జవాన్ గొర్రె అశోక్ తదితరులు పాల్గొన్నారు.