హనుమకొండ చౌరస్తా, జూన్ 8: సమస్యలు పరిష్కరించేందుకు ‘పట్టణ ప్రగతి’ వేదికలాంటిదని
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఐదో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రేటర్ పరిధిలోని 6వ డివిజన్లో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాసర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సమస్యల పరిష్కారానికి అధికారులు పాటుపడాలన్నారు. డివిజన్లో పలు రకాల పూలు, పండ్ల మొక్కలను చీఫ్‌విప్‌తో కలిసి నాటారు. అనంతరం రూ.60లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను శంకుస్థాపన చేశారు. సీఎంఆర్ఎఫ్ చెకులను పేదల ఇండ్లకు వెళ్లి అందించారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత ప్రేమగల ప్రాంతం వరంగల్ అని, ఇక్కడి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని చెప్పారు. వరంగల్ మహానగరానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా వరంగల్ అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో పేదల కోసం బస్తీ దవాఖానలు, మహిళల సమస్యల పరిష్కారానికి సఖీ వన్‌స్టాప్ సర్వీస్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. 6వ డివిజన్లోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్ వద్ద శిథిలావస్థలో ఉన్న ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ స్థానంలో కొత్తగా రెండంతస్తుల భవనంలో మహిళల కోసం రూ.48 లక్షలతో సఖీ సెంటర్ భవనం, పేదలకు వైద్యసేవలందించేందుకు రూ.15 లక్షలతో బస్తీ దవాఖాన నిర్మించనున్నట్లు తెలిపారు. అవకాశవాద రాజకీయా లు చేసే నాయకులను ప్రజలు నమ్మరన్నారు. అమలు కాని హామీలిస్తూ ఎన్నికలప్పుడే వస్తున్న నాయకులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజాహితం కోసమే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని, అవి విజయవంతంగా కొనసాగుతున్నాయని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ వివరించారు. 6వ రోజు 5, 6 డివిజన్లలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి అనేక సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. ఆరుగురికి రూ.6.90లక్షల సీఎంఆర్ఎఫ్ చెకులను అందించామన్నారు.
కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ చెన్నం మధు, గౌరవాధ్యక్షుడు రెడ్డి రాజేశ్వర్, అధ్యక్షులు మడిపల్లి సుమన్ గౌడ్, జనరల్ సెక్రటరీ బజ్జురి అజయ్‌కుమార్, మైనారిటీ అధ్యక్షుడు ఆరీఫ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ వెన్ను కొండయ్య, ఓరం ప్రదీప్‌కుమార్, కేస హరీశ్, అజాజ్, అహ్మద్, నిస్సార్, మహిళా మండలి ఆర్పీలు కవిత, ఝాన్సీ, అంగన్వాడీ టీచర్లు ,ఆశ వరర్లు, మహిళా నాయకులు మున్సిపల్ జవాన్లు, ఎలక్ట్రికల్ డీఈ, ఏఈ, అధికారులు, నీటి సరఫరా లైన్ మెన్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గ్రేటర్ 5వ డివిజన్ సుందరయ్యనగర్‌లో చీఫ్ విప్ దాస్యం, కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, మున్సిపల్, ఎలక్ట్రికల్ ఏఈలు, డీఈలు పర్యటించారు. సుందరయ్యనగర్‌లో పేదలకు విద్యుత్ మీటర్లు, మౌలిక సదుపాయాలు, డ్రెయిన్లు, సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు చీఫ్‌విప్ తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారు శ్రీనివాస్‌కు దళితబంధు వాహనాన్ని అందజేసి స్వీట్ తినిపించారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్, ఐదో డివిజన్ అధ్యక్షుడు బొల్లపల్లి చందర్రావు, ఉపాధ్యక్షుడు పండుగ సాగర్, దాసరి సమ్మయ్య, శ్రీరాం కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.