రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తోందని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్తో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాలు చేసే వారిని నమ్మవద్దని సూచించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా వరంగల్ నగరం అభివృద్ధి చెందుతున్నదని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
– హనుమకొండ చౌరస్తా, జూన్ 8
పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్ర వాతావరణం, పచ్చదనమే లక్ష్యంగా ‘ప్రగతి’ పనులు యజ్ఞంలా సాగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిరోజు ఊరూరూ విస్తృతంగా పర్యటిస్తుండడంతో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. చెత్తాచెదారం తొలగించడం, మురికి కాల్వలను, వీధులను శుభ్రం చేయడం, కొత్త కరంట్ పోల్స్ వేయడంతో పాటు అవసరమున్న, ఇబ్బంది పడే ప్రతి అంశాన్ని గుర్తిస్తున్నారు. అలాగే గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతూ ‘ప్రగతి’ లక్ష్యాన్ని వివరిస్తూ ముందుకుసాగుతున్నారు. బుధవారం ఆరో రోజూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పనులు ఉత్సాహంగా కొనసాగాయి.
ఆరో రోజైన బుధవారం ఉమ్మడి జిల్లా అంతటా పల్లె, పట్టణ ప్రగతి పనులు జోరుగా కొనసాగాయి. గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాసర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంత్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్తో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి.. పరిసరాలను పరిశీలించి ప్రజలను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌లోని పల్లె ప్రకృతి వనాన్ని వొడితెల సతీశ్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే, హనుమకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పరిశీలించారు. పట్టణ ప్రగతిలో భాగంగా జనగామలోని 13, 15వ వార్డుల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి కలియదిరిగి సమస్యలు తెలుసుకున్నారు. వీధుల వెంట చెత్తాచెదారం పడి ఉండడం, డ్రైనేజీలు నిండి ఉండడం చూసి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. జనగామ మండలం సిద్దెంకిలో పల్లె ప్రగతి పనులను కలెక్టర్ శివలింగయ్య పరిశీలించారు. మరిపెడ మున్సిపాలిటీతో పాటు గాలివారిగూడెం, తానంచర్ల గ్రామాల్లో మహబూబాబాద్ కలెక్టర్ శశాంక పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ ఇలాగేనా అంటూ అధికారులను మందలించా రు.
అలాగే నర్సరీ, పల్లెపకృతి వనం బాగుందంటూ సర్పంచ్ రామయ్యను కలెక్టర్ ప్రశంసించారు. పల్లెలుగా పచ్చగా మారాలని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. ఏటూరునాగారం మండలం శివ్వాపూర్‌లో పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించి బాగున్నాయంటూ సర్పంచ్ వంక దేవేందర్, పంచాయతీ కార్యదర్శి హసీనాను అభినందించి పలు సూచనలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని నిజాంపల్లె, గోరికొత్తపల్లి, వెంకటేశ్వర్లుపల్లె, జగ్గయ్యపేటలో పల్లె ప్రగతి పనులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. భూపాలపల్లి 2,14, 22వ వార్డుల్లో జంగేడు, ఫకీరుగడ్డ, లక్ష్మీనగర్, హనుమాన్‌నగర్‌లో అభివృద్ధి పనులను కలెక్టర్ భవేశ్‌మిశ్రా పరిశీలించి గుర్తించిన సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ 33వ డివిజన్ పెరుకవాడలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పర్యటించి రోడ్లు, డ్రైనేజీల మరమ్మతుల కోసం రూ.2కోట్లతో ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
