వర్ధన్నపేట, జూన్ 8 : రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచడంతో పాటు గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట బస్టాండ్ ఆవరణలో రూ.18లక్షలతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్, రూ.15లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన వైకుంఠరథాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసి సంపదను పెంచి ప్రజలకు పంచడం కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు వర్ధన్నపేటకు నిధులు కేటాయించలేదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.30కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే సుమారు రూ.20 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామన్నారు. ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని కోరారు. సిబ్బంది కూడా మొక్కలకు ఎప్పటికప్పుడు నీరు అందించాలని సూచించారు.
మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అరూరి అందజేశారు. గొర్రె కుమారస్వామికి రూ.2.50లక్షలు, దమ్మన్నపేట గ్రామానికి చెందిన కొండబోయిన సాయిలుకు రూ.2.50లక్షలు, మరో ముగ్గురికి రూ.లక్షా 50వేల విలువైన చెక్కులను అందించారు. చెన్నారం నర్సరీ, పల్లెప్రగతి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్‌ప్సన్ ఆంగోత్ అరుణ, వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, చెన్నారం సర్పంచ్ పునుగోటి భాస్కర్‌రావు, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.