భీమదేవరపల్లి జనవరి 5 : అమ్మా.. మా వీధులన్నీ గుంతల మయమై నడిచేందుకు వీలు లేకుండా అధ్వానంగా మారిపోయాయి. బాగు చేద్దామంటే గ్రామపంచాయతీలో ఒక్క రూపాయి కూడా లేదు. కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. సంక్రాంతి పండుగకు వైభవంగా జరిగే ఈ జాతరలో గ్రామంలోని ప్రతి ఇల్లు చుట్టాలు, బంధువులతో కళకళలాడుతుంది.
జాతర ఏర్పాట్లతోపాటు మా వీధులు, వాడల్లో మొరం కొట్టించి బాగు చేయాలని స్థానిక సర్పంచ్ సిద్ధమల్ల రమ హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను అర్థించారు.
సోమవారం సాయంత్రం మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానంలో జాతర ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సర్పంచ్ సిద్ధమల్ల రమ మాటలకు జిల్లా కలెక్టర్ ఒకింత ఆశ్చర్యపోయారు. జాతరలో గ్రామాభివృద్ధి సాధ్యం కాదని, జాతర అనంతరం వీధులు బాగుచేసేందుకు కావాల్సిన మొంరంతో పాటు సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.