హసన్‌పర్తి : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సిద్దాపూర్‌కు చెందిన దివ్యాంగురాలి (Physically handicapped ) ట్వీట్‌కు ఎమ్మెల్యే స్పందించారు. ఆమె కోరిక మేరకు బ్యాటరీ వీల్‌చైర్ (Battery Wheel Chair) అందించారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జట్టి ఎల్లయ్య పెద్దకూతురు శ్రీలత పుట్టుకతోనే దివ్యాంగురాలు. కుడి చేయి, ఎడుమ కాలు లేవు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా దాతల సహాయంతో బట్టల దుకాణం నిర్వహిస్తూ స్వయంఉపాధి పొందుతూ మార్గదర్శకంగా నిలుస్తుంది.
ఆమె ఇంటి నుంచి షాపునకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ( Minister KTR ) , ఎమ్మెల్యే అరూరి రమేశ్ MLA Ramesh), దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ( Vasudeva reddy) కి ట్వీట్ (Tweet) చేస్తూ తనకు వీల్‌చైర్ అందించాలని కోరింది. స్పందించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ దివ్యాంగుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితో మాట్లాడారు. కాగా, ఈ వీల్‌చైర్‌కు కుడి వైపు నుంచి ఆపరేటింగ్ చేసే వీలుంటుంది. కానీ శ్రీలతకు కుడి చేయి లేనందున ఎడుమ చేతితో ఆపరేటింగ్ చేసేందుకు కొన్ని మార్పులు చేపట్టి ఎడుమ చేతితో ఆపరేటర్ చేసే వీలుగా బ్యాటరీ చైర్ తయారు చేయించారు.
ఎమ్మెల్యే రమేశ్, వాసుదేవరెడ్డితో కలిసి శ్రీలత ఇంటికి వెళ్లి ఆమెకు బ్యాటరీ వీల్‌చైర్‌ను శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ శ్రీలతకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీలత మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్, వాసుదేవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, సర్పంచ్ ధనలక్ష్మి , వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ జక్కు రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.