ధర్మసాగర్ : రైతులు పండించిన మక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మక్కజొన్నల కొనుగోలు చేస్తుంది. అయితే మక్కజొన్నల కొనుగోలలో గోల్ మాల్ జరుగుతున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు రైతులకు మద్దతు ధర కల్పించి లాభం చేకూర్చాల్సి ఉండగా నిర్వాహకులతో దళారులు కుమ్మక్కై దందాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో మక్కజొన్న కొనుగోళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
మండలంలోని పలు గ్రామాలలో రైతుల నుండి నేరుగా మక్కలను కొనుగోలు చేయాల్సిన నిర్వాహకులు, దళారులతో కుమ్మక్కైనట్లు తెలుస్తుంది. ప్రభుత్వం మక్కలను కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక ముందు రైతుల వద్ద దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసిన మక్కలను ప్రస్తుతం నిర్వహకులతో కలిసి ప్రభుత్వ కేంద్రాలలో మద్దతు ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. రైతులకు ప్రకటించిన మద్దతు ధరను దళారుల మింగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మండల పరిధిలోని దేవునూరు, నారాయణగిరి, ఎల్కుర్తి ఆమ్లెట్ గ్రామం రామన్నగూడెంలలో ఉన్న దళారులతో నిర్వాహకులు కుమ్మక్కై దళారులు నిల్వ చేసుకున్న మక్కజొన్నలను ప్రభుత్వ కేంద్రాలలో విక్రయిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది.
మక్కల కొనుగోలు కేంద్రం నిర్వహకులతో కలిసిన దళారులు మండలంలోని కొన్ని గ్రామాలలో ప్రైవేట్ వ్యక్తి పేరు మీద గదులను అద్దెకు తీసుకొని మరి దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిర్వాహకులు సైతం దళారుల వద్దకే లారీలు పంపి మక్కలను విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో అర్హులైన రైతులకు మద్దతు ధర దక్కడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మక్కజొన్న కొనుగోలు లపై దృష్టి సారించి కొనుగోలుల గోల్ మాల్ ను అడ్డుకోవాలని పలువు రైతులు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రం నిర్వాహకుల పై అనుమానాలు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వహకులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ నిర్వాహకులే దళారులతో కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందించాలని ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు మద్దతు ధర అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులకు తెలిసే జరుగుతుందా ? లేదా నిర్వాహకులే దళారులతో కుమ్మక్కై చేస్తున్నారా ? అనే విషయాలు బయటపడాల్సింది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మక్కల గోల్ మాల్ ను అరికట్టి రైతులకు న్యాయం చేయాలని మండల రైతులు కోరుతున్నారు.