Pradeep Ranganathan | ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, దర్శకుడిగా–హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం తన కెరీర్లో కీలక దశను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న ఆయనకు, తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఊహించని షాక్ ఇచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాను దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించగా, హీరోయిన్గా కృతిశెట్టి నటించారు. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించారు. పలు వాయిదాల తర్వాత ఏప్రిల్ 10న విడుదలైన ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ, కథనాన్ని ఆసక్తికరంగా నడిపించలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. ప్రదీప్ తన పాత్రలో బాగా నటించినా, మిగతా అంశాలు సినిమాను నిలబెట్టలేకపోయాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘లవ్ టుడే’ కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. అనంతరం వచ్చిన సినిమాలు కూడా భారీ విజయాలు సాధించడంతో, హ్యాట్రిక్ ₹100 కోట్ల గ్రాస్ అందుకున్న హీరోగా అరుదైన రికార్డు సృష్టించాడు.‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.22 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. అయితే మిక్స్డ్ టాక్ కారణంగా ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లు పడిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రదీప్ రంగనాథన్ కెరీర్ ప్రారంభం నుంచే విజయవంతంగా సాగింది.కోమాలితో దర్శకుడిగా పరిచయం, లవ్ టుడేతో హీరోగా సెన్సేషన్, తరువాత వచ్చిన చిత్రాలు కూడా భారీ వసూళ్లు సాధించాయి. అయితే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాస్త నిరాశపరిచేలా ఉంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం, ఎన్నికల హడావుడి కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా పెద్దగా చర్చకు రాకపోవడం గమనార్హం. ఇప్పటివరకు వరుస విజయాలతో దూసుకెళ్లిన ప్రదీప్ రంగనాథన్‌కు ఇది మొదటి పెద్ద పరీక్షగా మారింది. ఈ సినిమా ఫైనల్‌గా ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో, అలాగే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.