కాజీపేట దర్గాలో అర్ధరాత్రి ఉత్సవాలు ప్రారంభం
కనులపండువలా గంధం ఊరేగింపు
ఆకట్టుకున్న కవ్వాలి, ఫకీర్ల విన్యాసాలు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. కిక్కిరిసిన దర్గా ప్రాంగణం
300 మంది పోలీసులతో పటిష్ట భద్రత
30కి పైగా సీసీ కెమెరాల ఏర్పాటు
ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ రూం.. భక్తుల కోసం ఉచిత వైద్యశిబిరం
కాజీపేట, అక్టోబర్ 4 : దర్గా కాజీపేటలోని సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు సోమవారం అర్ధరాత్రి ‘సందల్’ వేడుకతో ఘనంగా ప్రారంభమయ్యాయి. సందల్ ఊరేగింపు అర్ధరాత్రి వరకు కన్నుల పండువలా సాగింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశ విదేశాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దర్గా కాజీపేట జాగీర్‌లోని (బడేఘర్)లో సంప్రదాయం ప్రకారం బియాబానీ కుటుంబానికి చెందిన మహిళలు, ముస్లిం మతపెద్దలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం సుగంధ ద్రవ్యాల నుంచి తీసిన గంధాన్ని వెండిగిన్నెలో భద్రపర్చారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ఆధ్వర్యంలో పలు దర్గాల పీఠాధిపతులు బడేఘర్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పీఠాధిపతి ఖుస్రూపాషా గంధంతో ఉన్న వెండిగిన్నెను తలపై పెట్టుకుని దర్గాకు తీసుకెళ్తుండగా గిన్నెను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. రాత్రి 11 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాగింది. డప్పుచప్పుళ్లు, ఫకీర్ల విన్యాసాలు, కవ్వాలి, భజన కీర్తనలు, యువకుల నృత్యాలు, కేరింతల నడుమ దర్గా ప్రాంతమంతా మార్మోగింది.
అర్ధరాత్రి తర్వాత దర్గాకు చేరుకున్న పీఠాధిపతి ఖుస్రూపాషా దర్గాలోని సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ సమాధికి గంధలేపనం చేసి పుల్ చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా దర్గా ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. దర్గా ప్రాంగణంలో దుకాణాలు, చిల్డ్రన్స్ ఎగ్జిబిషన్ వంటివి వెలిశాయి. పిల్లలను ఆకర్షించేందుకు ఎగ్జిబిషన్ నిర్వాహకులు రంగుల రాట్నం, ట్రైన్, ఫిష్, మోటర్ సైకిళ్లు, కప్ సాసర్, జంపింగ్, తదితర పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భక్తుల కోసం జిల్లా ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్న భక్తుల కోసం దర్గా ప్రాంగణం సమీపంలో డాక్టర్ మధులత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా భక్తులు వైద్యశిబిరాన్ని సంప్రదిస్తే మందులు పంపిణీ చేస్తున్నారు.
దర్గా ఉర్సు ఉత్సవాలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేవారు. సీపీ తరుణ్‌జోషి ఆదేశాలతో కాజీపేట ఏసీసీ శ్రీనివాస్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్లను డైవర్షన్ చేశారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో దాదాపు మూడు వందల మంది కానిస్టేబుళ్లు, 20 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, ఐదుగురు సీఐలు విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దర్గా పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 30కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా తెలిపారు.