పరకాల, జూన్ 17 : మహిళలకు ఆసరాగా పోచంపల్లి ఫౌండేషన్ నిలుస్తుందని, వారి ఉపాధి కోసం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ, ఉపాధి అవకాశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోచంపల్లి మాట్లాడుతూ మహిళల సాధికారతకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన ఎంతో ముఖ్యమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నామని, దీని ద్వా రా మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించడంతో పాటు కుటుంబానికి అండగా నిలబడి, సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉమ్మడి పరకాల మండలంలోని వేయి మంది మహిళలకు త్వరలోనే కుట్టు మిషన్లు ఉచితంగా అందిస్తామని పోచంపల్లి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఎక్కువ ఉద్యోగాలు మహిళలకే దక్కుతాయని, వాటిలో స్థానికులకే తొలి ప్రాధాన్యం దక్కుతుందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి పోచంపల్లి ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చల్లా సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చందుపట్ల సాయి తిరుపతిరెడ్డి, బండి సారంగపాణి, కుమారస్వామి, రాకేశ్‌రావు, శనిగరపు నవీన్, దేవేందర్, బాపురావు, సుగుణాకర్, గంట సమ్మిరెడ్డి, ఆముదాలపల్లి అశోక్, నందికొండ జైపాల్‌రెడ్డి, బొబ్బిలి, దినేశ్, వీరేశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.