నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో పరుగులు పెట్టిన పల్లెలు నేడు నిధులు లేక అస్తవ్యస్తంగా మారాయి. ప్రతి చిన్న గ్రామ పంచాయతికీ సొంత భవనం ఉండాలన్న గొప్ప సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి నిధులతో నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అర్థాంతరంగా వదిలేసింది. నిధుల విడుదలను పూర్తిగా నిలిపివేసింది. ఫలితంగా శిథిల భవనాలు.. అద్దె గదుల్లో గ్రామ పంచాయతీల పాలనా వ్యవస్థ కునారిల్లుతున్నది.
– తొర్రూరు, డిసెంబర్ 6
గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పదేళ్ల పాలన సాగింది. ప్రతి చిన్న జీపీకి సొంత భవనం ఉండాలనే సంకల్పంతో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి నిధులతో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే, ప్ర భుత్వం మార డం.., అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు నూతన జీపీ భవన నిర్మాణాలపై సీతకన్ను వేసింది. నిధుల విడుదలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఫలితంగా కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలు కొన్ని అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వర్తిస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో శిథిల భవనాల్లో కార్యకలాపా లు సాగిస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన భవనాల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్థాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 2018-2023లో తొర్రూరు మండలంలోని చర్లపాలెం, కరాల, వెంకటాపురం, అమర్‌సింగ్ తండా, పెద్దమంగ తండా, జీకే తండా, సోమారపుకుంట తండా, అమ్మాపురం, ఖానాపురం, కొమనపల్లి తండా, భోజ్య తండా, గుర్తూరు, కంఠాయపాలెం, దుబ్బ తండా, టీక్యతండా, మడిపల్లి, జమాస్తాన్పురం, గోపాలగిరి, గూడిబండ తం డా, నాంచారి మడూరు, హట్యతండా సహా మొత్తం 21 గ్రామాలకు రూ.4.20కోట్లతో కొత్త పంచాయతీ భవనాలు మంజూరు చేశారు.
అయితే వీటి లో అనేక భవనాలు స్లాబ్ దశలోనే నిలిచిపోగా, పూర్తయిన కొన్ని భవనాలు ప్రారంభోత్సవానికి నోచుకోక నిరుపయోగకరంగా మారా యి. నిధుల విడుదలలో కాంగ్రె స్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపంతోనే నిర్మాణాలు పెండింగ్‌లోనే పడ్డాయ ని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని గోపాలగిరి గ్రామంలో నూతన జీపీ కోసం నాటి సర్కారు సుమారు రూ.20 లక్షలు మంజూరు చేసి నా సార్వత్రిక ఎన్నికలు రావడంతో నిర్మాణ పను లు ప్రారంభం కాలేదు.
దీంతో ప్రస్తుతం అద్దె భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఖానాపురంలో పంచాయతీ భవనం పనులు 90 శాతం పూర్తికాగా, మిగిలిన 10 శాతం పనులకు బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో మూడు ఏళ్లుగా నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. అలాగే భోజ్యతండాలో నూతన పంచాయతీ భవన నిర్మాణం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో చాలా గ్రామాల్లో అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.