హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 21: కైస్తవుల ఆస్తుల పరిరణక్షకు 30 సంవత్సరాల తర్వాత మద్రాసు హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందని హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సీబీసీ) అధ్యక్షుడు తాళ్లపల్లి విజయ్ స్వరూప్ అన్నారు. గురువారం హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సీబీసీ)లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాపర్టీస్ అసోసియేషన్ ఆఫ్ బాప్టిస్టు చర్చెస్(పీఏబీసీ), సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్టు చర్చెస్(ఎస్టీబీసీ) అనే సంస్థలు సమన్వయంగా అమెరికన్ బాప్టిస్టు ఫారిన్ మిషనరీ సేవలు విద్యా, వైద్యం, చర్చీలు అభివృద్ధి కోసం చేశాయన్నారు.
బ్రిటిష్ కాలంలో అమెరికన్ బాప్టిస్టు ఫారిన్ మిషన్ సొసైటీ(ఏబీఎఫ్‌ఎంఎస్) దక్షిణ భారతదేశంలో 1800 సంవత్సరంలో క్రైస్తవసేవ సంస్థగా ప్రారంభించి కొన్ని వందల ఎకరాలలో చర్చీలు, విద్యాలయాలు, హాస్పిటల్స్ నిర్మించి తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో పేద ప్రజలకు సేవలందించారన్నారు. 1960 నుంచి 1970 సంవత్సరంలో స్థానిక చర్చి ఫీల్డ్స్క, ఎస్టీబీసీ సొసైటీకి సేవ నిర్వహణ బాధ్యతలు అప్పగించి అమెరికా వెళ్లిపోగా వారు ఏర్పాటు చేసిన సంస్థలు సేవలు అభివృద్ధి చేయటానికి ఏర్పడిన పీఏబీసీ అనే సంస్థ అభివృద్ధి చేయకుండా వాటి నిర్వహణ పేరుతో మిషనరీ ఆస్తులపై యాజమాన్యం హక్కులు కలిగి ఉన్నామని చెబుతూ మిషనరీ ఆస్తులు 1979 నుంచి అమ్మడం జరిగిందన్నారు.
అలా అమ్మిన ఆస్తులు చెల్లవని, పీఏబీసీ సంస్థకు అమ్మే అధికారం మిషనరీలు ఇవ్వలేదని కోర్టు కేసు వేయగా మద్రాసు హైకోర్టు పీఏబీసీ అనే సంస్థను ట్రస్ట్‌షిప్ నుంచి తొలిగించడమైందని, ఏబీఎఫ్‌ఎంఎస్ అనే సంస్థ ఆస్తులు పీఏబీసీకి బదలాయింపు ప్రక్రియ పూర్తిఅయిన కారణంగా ఏబీఎఫ్ఎంఎస్కి ఎలాంటి హక్కులు లేవన్నారు. 25 జులై 2000 తర్వాత జరిగిన అన్ని అక్రమ లావాదేవీలను రద్దు పర్చినట్లు, కొత్త ట్రస్టీని ఎన్నుకోవడానికి మార్గదర్శకాలను ఈ తీర్పు ద్వారా సూచించినట్లు చెప్పారు.
కైస్తవ మిషనరీ ఆస్తులు ద్వారా సువార్త సేవా, స్కూళ్లు, హాస్పిటల్స్, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టాలని, బీద, అణగారిన ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కైస్తవ మిషనరీ ఆస్తులు అమ్మడానికి గాని కొనడానికి గానీ ఎవరికీ అధికారం లేదని కోర్టు స్పష్టం చేసినట్లు వారు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కృషి వలనే కైస్తవుల ఆస్తులను కాపాడుకోవడం జరిగిందన్నారు. న్యాయవాది రాంగోపాల్ రావు, నెల్లూరుకు చెందిన కైస్తవులు డి.అనిల్‌కుమార్, సునీల్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో సీబీసీ సెక్రటరీ క్రిష్టోఫర్ రూబెన్, జాయింట్ సెక్రటరీ జయాకర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.