సంబురాల సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు ఇల్లిల్లూ ముస్తాబైంది. రంగవల్లులతో వాకిళ్లన్నీ ముచ్చటగొలుపుతుండగా గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. సకల సౌభాగ్యాలు కలుగాలని నోచే నోములు, తీరొక్క బొమ్మల కొలువులతో ఇంటింటా సందడి నెలకొననుంది.
భానుడు దక్షిణాయనం చాలించి, ఉత్తరాయనంలోకి అడుగుపెట్టే సంక్రాంతి పర్వదినాన్ని ఆదివారం ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభంలో దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ సమయంలో అలంకరణ ఉన్న ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని హిందువులు నమ్ముతారు. శివుడి నంది స్వరూపాలుగా భావించే గంగిరెద్దులు ఇంటి ఆవరణలో ప్రవేశించడాన్ని శుభ సూచకంగా భావిస్తారు. హరిదాసును విష్ణుస్వరూపంగా భావించి ధాన్యాన్ని దానంగా సమర్పిస్తారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు చిన్నా పెద్దలను ఆకట్టుకుంటాయి. మహిళలు బొమ్మల కొలువులు పెట్టి నోములు నోచుకుని ముత్తయిదువుల ఆశీర్వాదం తీసుకుంటారు. ద్వేషాలు తొలిగి సంతోషాలతో కలకాలం కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ నోములు, వ్రతాలు చేస్తారు. సంక్రాంతి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలను సందర్శించి, పూజలు చేయనున్నారు. పిల్లలు పతంగులు ఎగురవేసే పనిలో తలమునకలయ్యారు.
– పో చమ్మ మైదాన్